Share News

కెనడాలో ఉద్యోగాల పేరుతో 50 కోట్ల మోసం

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:59 AM

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన దంపతులపై బాధితులు శుక్రవారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కెనడాలో ఉద్యోగాల పేరుతో 50 కోట్ల మోసం

  • దాదాపు 800 మంది నుంచి వసూలు చేసిన దంపతులు

  • ఫ్లయింగ్‌ బోర్డర్‌ కన్సల్టెన్సీ పేరుతో హైదరాబాద్‌, విజయవాడలో దందా

  • హైదరాబాద్‌ సీసీఎస్‌ను ఆశ్రయించిన బాధితులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన దంపతులపై బాధితులు శుక్రవారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్‌, సౌజన్య దంపతులు.. విజయవాడ, హైదరాబాద్‌లలో ఫ్లయింగ్‌ బోర్డర్‌ కన్సల్టెన్సీని ప్రారంభించారు. కెనడాలో భారీ వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌లో ప్రచారం చేశారు. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వారిని సంప్రదించారు. మంచి కంపెనీల్లో ఉద్యోగం పొందాలంటే ఒక్కో అభ్యర్థి రెండు దఫాలుగా రూ.12 లక్షలు చెల్లించాలని తెలిపారు. ముందుగా రూ.6 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగం వచ్చి కెనడాకు వెళ్లిన తర్వాతే మిగిలిన రూ.6 లక్షలు ఇవ్వాలని చెప్పటంతో చాలామంది వారి మాటలు నమ్మారు. విజయవాడ, హైదరాబాద్‌లలో కలిపి సుమారు 800 మంది నుంచి రూ.50 కోట్లకు పైగా వసూలు చేశారు. మొదటి దఫా డబ్బు చెల్లించినవారికి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే, ఇంటర్వ్యూలకు హాజరైన పలువురు అభ్యర్థులకు నిర్వాహకుల ప్రవర్తన, ఇంటర్వ్యూ చేస్తున్న వారి భాషతీరుపై అనుమానం వచ్చింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు ఇటీవల సౌజన్య, శ్రీనివాస్‌ దంపతులను అరెస్టు చేశారు. కానీ, అక్కడ వారు బెయిల్‌పై బయటకు వచ్చి హైదరాబాద్‌లో అవే మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌లోని బాధితులు శుక్రవారం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు సౌజన్య, శ్రీనివా్‌సలపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 25 , 2026 | 07:02 AM