Share News

సైబర్‌ నేరాల కేజీఎఫ్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:01 AM

కేజీఎఫ్‌ సినిమా చూశారా ? ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని బందీలుగా తీసుకొచ్చి వారితో బంగారు గనుల్లో వెట్టి చాకిరీ చేయిస్తుంటారు. ఆ బందీలు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించే ....

సైబర్‌ నేరాల కేజీఎఫ్‌

  • కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం

  • థాయ్‌లాండ్‌ సైనిక చర్యతో వెలుగులోకి

  • భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్‌ నేరాలు

  • డిజిటల్‌ అరెస్టు మోసాల కోసం వివిధ దేశాల పోలీసు స్టేషన్ల సెట్లు

  • ప్రైవేటు సైన్యంతో భవనాలకు కాపలా

  • బందీల్లో పలువురు భారతీయులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కేజీఎఫ్‌ సినిమా చూశారా ? ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని బందీలుగా తీసుకొచ్చి వారితో బంగారు గనుల్లో వెట్టి చాకిరీ చేయిస్తుంటారు. ఆ బందీలు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించే ప్రైవేటు సైన్యం అదుపు చేస్తుంటుంది. మొత్తంగా కేజీఎ్‌ఫను ఓ భయంకరమైన సామ్రాజ్యంగా సినిమాలో చూపిస్తారు. అచ్చం కేజీఎ్‌ఫలానే కంబోడియా కేంద్రంగా ఓ సైబర్‌ నేర ముఠా పెద్దఎత్తున పని చేస్తుంది. వేర్వేరు దేశాలకు చెందిన వందలాది మందిని ఒక చోట బంధించి, వాళ్లతో డిజిటల్‌ అరెస్టులు వంటి రకరకాల సైబర్‌ నేరాలు బలవంతంగా చేయించి రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇందుకోసం ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించి వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడింది. కంబోడియా, థాయ్‌లాండ్‌ దేశాల మధ్య సరిహద్దు అంశంలో ఇటీవల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌ సరిహద్దులో కంబోడియాలోని ఓస్మాచ్‌ అనే పట్టణంపై థాయ్‌ సైన్యం చేసిన దాడితో ఈ సైబర్‌ నేర ముఠా గుట్టు బయటపడింది. డిసెంబరులో వైమానిక, ఉపరితల దాడులు చేసిన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇటీవల అంతర్జాతీయ మీడియాను అందులోని ఓ ఆరు అంతస్తుల భవనంలోకి తీసుకెళ్లింది.


పోలీసు స్టేషన్‌ సెట్టింగ్‌లు, వందలాది ఫోన్లు, కంప్యూటర్లు

థాయ్‌ సైన్యం, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కంబోడియాలోని ఓస్మాచ్‌ పట్టణంలో సైబర్‌ నేర ముఠాలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో ఉద్యోగాల పేరిట వేర్వేరు దేశాల నుంచి రప్పించిన యువతను అక్కడి భవనాల్లో బంధించారు. వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్లతో సైబర్‌ నేరాలు చేయించేవి. ఈ బందీల్లో భారతీయులు, తెలుగు వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ బందీలంతా రకరకాల మార్గాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకునేవారు. చూడడానికి ఓ ఐటీ కంపెనీ మాదిరిగా ఉండే ఆ కార్యాలయాల్లో సైబర్‌ నేరాలు చేసేందుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అధికమైన డిజిటల్‌ అరెస్టు మోసాలు చేయడానికి వీలుగా వివిధ దేశాల పోలీసు స్టేషన్లు, బ్యాంకుల సెట్టింగులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నం, సింగపూర్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లోని పోలీసుస్టేషన్లను తలపించేలా ప్రత్యేకంగా వేసిన పోలీసు స్టేషన్‌ సెట్టింగ్‌లు, ఆయా దేశాల పోలీసుల దుస్తులు. జాతీయ జెండాలు భవనంలో దొరికాయి. ఇక, వియత్నంకు చెందిన ఓ బ్యాంకు శాఖను తలపించేలా క్యాష్‌ కౌంటర్లు, గోడలపై బ్యాంకు ప్రకటనలతో బ్యాంకు సెట్టు కూడా వేసేశారు. ఇక, భవనంలోని గదుల్లో ఎక్కడికక్కడ కంప్యూటర్లు, బోర్డులు, రకరకాల పత్రాలు, మోసం ఎలా చేయాలనే ప్రణాళికలు(వేర్వేరు భాషల్లో రాసి ఉన్న పత్రాలు, డైరీలు) దొరికాయి. కొన్ని బోర్డులపై రోజువారీ లక్ష్యాలు, ఎంత సొమ్ము దోచుకున్నాం. మరెంత దోచుకునే అవకాశం ఉంది వంటి వివరాలు రాసి ఉన్నాయి. వందలాది కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కలు, సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లు, అత్యాధునిక ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఆ భవనంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక, తమ వద్ద బందీలుగా ఉన్నవారి పట్ల సైబర్‌ ముఠాలు అమానవీయంగా ప్రవర్తించేవని తెలిసింది. ఈ బందీలను నియంత్రించడానికి, రక్షణగా ఉండేందుకు రక్షణ సిబ్బందికి సైబర్‌ ముఠాలు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే, థాయ్‌ సైన్యం దాడి చేసినప్పుడు ఆ భవనాల్లో బందీలుగా ఉన్నవారంతా ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. వీళ్లందరినీ అదుపులోకి తీసుకున్న థాయ్‌ సైన్యం.. వారి పాస్‌పోర్టుల ఆధారంగా తనిఖీలు చేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తోంది. కొందరిని నిబంధనల ప్రకారం వారి స్వదేశాలకు తరలిస్తోంది. కాగా, అంతర్జాతీయంగా సైబర్‌ నేరాలకు కంబోడియా కేంద్రంగా మారుతోందనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. సైబర్‌ నేరాల రూపంలో దొంగలించిన సొమ్ము ఏటా 12.5 బిలియన్‌ డాలర్లు వరకు కంబోడియాకు చేరుతున్నట్టు అంచనా.


సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు యువకుడి ఆత్మహత్య

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు పట్టణాలు, జిల్లా కేంద్రాలకు పరిమితమైన సైబర్‌ నేరాలు నేడు పల్లెలకూ పాకాయి. సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి ములుగు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటాపురం మండలంలోని తిప్పాపురం గ్రామంలో కూలి పనులు చేసుకునే కోరం రామారావు (36) మొబైల్‌ ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని రామారావు వెంకటాపురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు అతడికి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించి పంపించారు. ఈక్రమంలో అతడి ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు బయటపెడతారేమోనని భావించిన రామారావు శనివారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:01 AM