Share News

kumaram bheem asifabad- కాగితాల్లో లెక్కలు.. కనిపించని మొక్కలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:29 PM

పచ్చదనం పెంచి, పర్యావరణ పరిక్షణకు ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. రికార్డుల్లో వేలాది మొక్కలు నాటుతున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు.

kumaram bheem asifabad- కాగితాల్లో లెక్కలు.. కనిపించని మొక్కలు
లోగో

- లక్ష్యం ఘనం.. క్షేత్రస్థాయిలో కానరాని ఫలితం

ఆసిఫాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం పెంచి, పర్యావరణ పరిక్షణకు ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. రికార్డుల్లో వేలాది మొక్కలు నాటుతున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో మొక్కలు నాటలేదు. వనమహోత్సవం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తీర్ణం పెంపు, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోంది. కానీ జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అధికారులు కాగితాలపై చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోతోంది. లక్షలాది మొక్కలు నాటినట్లు లెక్కలు చూపుతున్నా.. వాటిలో చాలా వరకు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- ఉన్నతాశయంతో..

ఉన్నతాశయంతో ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కాగితాలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో నాటిన మొక్కల కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. నామమాత్రంగా మొక్కలను నాటి రికార్డుల్లో మాత్రం లక్ష్యసాధన పూర్తయిందంటూ అధికారులు భుజాలు చరుచుకుంటున్నారు వాస్తవానికి కొన్నిచోట్ల కొంతమేర నాటగా, మరికొన్నిచోట్ల అసలే నాటలేదు. నర్సరీల్లో ఎండిపోయిన మొక్కలే దీనికి నిదర్శనం ఫలితంగా ప్రజాధనం వృథా అయింది.వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో 46.78 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యం. శాఖల వారీగా 43 లక్షలు నాటినట్లు అధికారులు వెల్లడించి 92.67 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు రికార్డులు చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలో అసలు నిజాలు బయటపడుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో నాటినట్లు చెబుతున్న మొక్కల్లో చాలాచోట్ల కనిపించడం లేదు. ఆగస్టులో అడపాదడపా కురిసిన చినుకులకే అధికారుల హడావుడి చేశారు. ఎల్‌నినోతో వర్షాలు రావని తెలిసినప్పటికీ రికార్డుల నమోదు కోసమే హడావుడిగా మొక్కలు నాటేశారు. తగినంత తేమ శాతం లేకపోవడం, వర్షాలు ముఖం చాటేయడంతో ఎక్కువగా నర్సరీలకే పరిమితమయ్యాయి.

- అటవీ ప్రాంతాలు..

గ్రామపంచాయతీలు, అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటినట్లు అధికారులు నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ వాటి సంరక్షణపై నిరంతర పర్యవేక్షణ ఉండడం లేదు. మొక్కలు నాటిన ప్రాంతాలను క్రమం తప్పకుండా పరిశీలించి, ఎండిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో మొక్కల పెంపకం కార్యక్రమం కేవలం లెక్కలకే పరిమితమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సరీల్లో మొక్కల పెంపకం, గుంతల తవ్వకం, రవాణా కూలీల ఖర్చులు అంటూ ఏటా వనమహ్సోతవం పేరిట లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు. అధికారుల కాగితాల్లో చూపిస్తున్న ఈ రికార్డుల మాయాజాలంతో ప్రభుత్వ ఆశయం పక్కదారి పడుతోంది ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటకపోగా, ఉన్న చోట ట్రీగార్డులు సైతం ఏర్పాటు చేయలేదు.

శాఖ లక్ష్యం నాటిన మొక్కలు

-----------------------------------------------------------------------------------

అటవీ 6.45 లక్షలు 6 లక్షలు

డీఆర్‌డీఏ 32.5 లక్షలు 32 లక్షలు

మున్సిపల్‌ 3.20 లక్షలు 1.52 లక్షలు

సింగరేణి 1.90 లక్షలు 1 లక్ష

విద్యా 40 వేలు 15 వేలు

వ్యవసాయ 30 వేలు 10 వేలు

అబ్కారీ 50 వేలు 5 వేలు

ఇరిగేషన్‌ 30 వేలు 15 వేలు

హార్టికల్చర్‌ 20 వేలు 5 వేలు

ఆర్‌అండ్‌బీ 5 వేలు 1000

రెవెన్యూ 10 వేలు 1000

శిశుసంక్షేమ 5 వేలు 1000

మత్స్యకార 5 వేలు 1000

Updated Date - Nov 16 , 2026 | 10:29 PM