Share News

రాష్ట్రంలో పథకాలకు కోతలు

ABN , Publish Date - May 17 , 2026 | 06:05 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పలు సంక్షేమ పథకాలకు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయింది.

రాష్ట్రంలో పథకాలకు కోతలు

  • రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు తగ్గిన ఖర్చు

  • యువ వికాసం, ఆత్మీయ భరోసాకు అసలు నిధులే ఇవ్వలేదు

  • రాబడులు, గ్రాంట్లు, పన్నేతర ఆదాయం తగ్గడమే కారణం

  • 2025-26లో వ్యయ అంచనాలను చేరుకోలేదని తేల్చిన కాగ్‌

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పలు సంక్షేమ పథకాలకు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయింది. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వం ఆశించిన రాబడి రాకపోవట మే ఇందుకు కారణమని 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన వ్యయ లక్ష్యాలపై కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇటీవల విడుదల చేసిన మార్చి నెల నివేదికలో స్పష్టంచేసింది. లక్ష్యానికి మించి అప్పులు తెచ్చి సర్దుబాటు చేద్దామని ప్రయత్నించినా వీలుకాకపోవటంతో కొన్ని పథకాలకు నిధులు తగ్గించింది. రైతు భరోసా పథకానికి 2025-26లో ఖరీఫ్‌, రబీ సీజన్లకు కలిపి రూ.18,000 కోట్లు కేటాయించగా, రూ.14,397 కోట్లు మాత్రమే వ్యయం చేయగలిగింది. రబీ సీజన్‌లో రెండు దఫాలుగా 2 ఎకరాల లోపువారికి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. మూడో విడత కూడా జమ చేస్తామని ప్రకటించినప్పటికీ... వచ్చే జూన్‌ నుంచి 2026-27 ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నందున నిధులు జమ చేస్తుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ జమ చేయకపోతే ఈ పథకం కింద రూ.3,500 కోట్ల మేర కోత పడినట్లే. రైతు బీమా పథకానికి రూ.666 కోట్ల మేర నిధులు తగ్గినట్లు తెలుస్తోంది. రాజీవ్‌ యువ వికాసం పథకానికి బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించినా.. పథకం ప్రారంభం కాకపోవటంతో నిధులేమీ ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించింది. కానీ, పథకాన్ని ప్రారంభించలేదు. చేయూత పథకానికి రూ.14,861 కోట్లు కేటాయించి, రూ.11,400 కోట్లు ఖర్చు చేసింది. ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి భారీగా రూ.12,571 కోట్లు కేటాయించినా.. విడుదల చేసింది మాత్రం రూ.5,400 కోట్లే. ఈ పథకానికి రూ.7,000 కోట్ల మేర కోత పడింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద బడ్జెట్‌లో రూ.3,300 కోట్లు కేటాయించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయాలి. కానీ, ఈ నిధులు విడుదల కావడం లేదని, తాము నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విద్యార్థుల ఉపకార వేతనాల నిధుల్లోనూ కోత పడినట్లు సమాచారం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ.600 కోట్లు కేటాయించినా.. ఈ పథకం ఇంకా ప్రారంభమే కాలేదు. పథకాలు, ఇతర వ్యయాల కోసం ప్రభుత్వం భారీగానే అప్పులు తెచ్చింది. బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.54,009.74 కోట్ల రుణాలు తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించి... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏకంగా రూ.77,762.35 కోట్ల రుణాలు తీసుకుంది. అయినా వ్యయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.


రాబడులు తగ్గటమే కారణం..

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు ఆశించిన మేర సమకూరలేదు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలు కావడంతో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర ఆదాయాన్ని భారీగా ఆశించినా... భూముల విక్రయాల్లో మందకొడితనంతో రాబడి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు కూడా నిరాశే మిగిల్చాయి. దీంతో ముఖ్యమైన పథకాలకు కూడా పూర్తిస్థాయిలో నిధులు సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్వీయ పన్నుల రాబడి రూ.1,75,319.36 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, మార్చి 31 నాటికి రూ.1,52,400.91 కోట్లు మాత్రమే వచ్చింది. రూ.22,918.45 కోట్ల రాబడి తగ్గింది. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19,087.26 కోట్లు వస్తాయని అంచనా వేయగా, రూ.15,251.03 కోట్లు (79.90శాతం) మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.27,623.36 కోట్లు ఆశించగా, రూ.22,359.52 కోట్లు (80.94శాతం) మాత్రమే వచ్చాయి. పన్నేతర రాబడి కింద రూ.31,618.77 కోట్లను అంచనా వేయగా, వచ్చింది రూ.18,986.64 కోట్లు (60.05శాతం) మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ గ్రాంట్ల విషయంలో దెబ్బ తీస్తోంది. ఈ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. వచ్చింది మాత్రం రూ.10,422.98 కోట్లే. అంటే అంచనాలో 45.75శాతం మాత్రమే వచ్చాయి. రాబడులు తగ్గటంతో ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించింది.

Updated Date - May 17 , 2026 | 06:05 AM