రాష్ట్ర వ్యయం 80 శాతమే
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:10 AM
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బడ్జెట్‌ను ఖర్చు చేయలేదని ‘కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ....
2024-25లో బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదు
2024-25 బడ్జెట్‌పై ‘కాగ్’ నివేదిక
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బడ్జెట్‌ను ఖర్చు చేయలేదని ‘కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ పేర్కొంది. 2024-25లో రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. రెవెన్యూ, మూలధన వ్యయాల కింద రూ.2,74,058 కోట్లను ఖర్చు చేస్తామని ప్రతిపాదించింది కానీ.. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,18,251 కోట్లను మాత్రమే వ్యయం చేసిందని తెలిపింది. అంచనా వ్యయంలో ఇది 80 శాతమేనని వెల్లడించింది. దీంట్లో రెవెన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం కింద ఎక్కువ మొత్తం ఖర్చయ్యింది. రెవెన్యూ వ్యయం కింద రూ.2,20,945 కోట్ల ఖర్చును అంచనా వేయగా... రూ1.77,224 కోట్ల (80 శాతం) వ్యయం జరిగింది. మూలధన వ్యయం పద్దు కింద రూ.33,487 కోట్లను వ్యయం చేస్తామని ప్రతిపాదించగా... రూ.36,072 కోట్ల (108 శాతం)ను వ్యయం చేశారు. వ్యయ పద్దుల్లో వడ్డీ చెల్లింపులు ప్రభుత్వానికి భారంగా పరిణమించాయి. దీని కింద రూ.17,730 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది కానీ, రూ.27,803 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగుల జీత భత్యాల బిల్లు కూడా పెరిగింది. దీని కింద రూ.28,093 కోట్లు సరిపోతాయని ప్రభుత్వం అంచనా వేయగా... రూ.30,277 కోట్లను వ్యయం చేయాల్సి వచ్చింది.
ఆశించిన మేర సమకూరని రాబడులు
రెవెన్యూ రాబడులు ఆశించిన మేర సమకూరకపోవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందని ‘కాగ్’ వెల్లడించింది. రూ.2,21,242 కోట్లు వస్తాయని ఆశించగా... రూ.1,67,804 కోట్లు (76 శాతం) మాత్రమే వచ్చాయి. ప్రధానంగా పన్నేతర రాబడి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల విషయంలో అంచనాలు భారీగా తప్పాయి. పన్నేతర రాబడి కింద అంచనా వేసిన రూ.35,208 కోట్లలో రూ.23,608 కోట్లు(67 శాతం) మాత్రమే సమకూరాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల కింద రూ.21,636 కోట్లు ఆశించగా... వచ్చింది రూ.7,913 కోట్లు. అంటే అంచనాల్లో 37 శాతమే. రెవెన్యూ రాబడులు కాస్త ఎక్కువగా ఉంటాయని, రెవెన్యూ వ్యయం తక్కువగా ఉంటుందని.. తద్వారా రూ.297 కోట్ల మిగులు ఉంటుందని ప్రభుత్వం ఆశించింది. మిగులు మాట పక్కన పెడితే... ఏకంగా రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. మరోవైపు, రూ.49,256 కోట్ల ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేయగా... రూ.48,922 కోట్ల మేర ఉన్నట్లు తేలింది. దీనిని బహిరంగా మార్కెట్ నుంచి రూ.48,922 కోట్ల మేర అప్పులు తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వం భర్తీ చేసింది.
2024-25లో రూ.65,537 కోట్ల అప్పు
2024-25లో చెల్లించని పాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (డబ్ల్యూఎంఏ) రూ.5,842 కోట్లు కలుపుకొని మొత్తం రూ.65,537 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ‘కాగ్’ వెల్లడించింది. దీంతో రాష్ట్ర అప్పు 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.4,47,493 కోట్లకు చేరిందని తెలిపింది. ఇది కాకుండా... వివిధ సంస్థలు, శాఖలకు రూ.57,305 కోట్ల రుణాలు తీసుకోవడానికి గ్యారెంటీలు ఇచ్చిందని వివరించింది. దాంతో మొత్తం గ్యారెంటీ రుణాలు రూ.2,41,528 కోట్లకు చేరాయని పేర్కొంది. ఎల్‌ఐసీ, జీఐసీ, నాబార్డు వంటి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.759 కోట్ల రుణాలు తీసుకుంది. అత్యవసరాల కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద రూ.1,29,376 కోట్ల అప్పు తీసుకోగా... రూ.1,24,534 కోట్లను తిరిగి చెల్లించింది. కాగా, రాష్ట్ర పన్నుల శాఖ నిర్వాకం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.149.41 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించింది. 2021-22కు సంబంధించి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని 40 కార్యాలయాల్లో వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, జీఎ్‌సటీ రికార్డులను పరిశీలించగా... రూ.149.41కోట్ల అవకతవకలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. ఎక్సైజ్ శాఖలో రూ.2.31కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.7.29 కోట్ల మేర, రవాణాశాఖలో రూ.10.40కోట్ల మేర అవకతవకలున్నట్లు కాగ్ తేల్చింది.