టీజీఐఐసీ లీలలు!
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:06 AM
హీరాబాద్ ‘జాతీయ పెట్టుబడులు, తయారీ ప్రాంతం’ (నిమ్జ్) కోసం తీసుకున్న రుణం నుంచి ‘తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల ...
హడ్కో రుణం 317 కోట్లు దారి మళ్లింపు: కాగ్
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్ ‘జాతీయ పెట్టుబడులు, తయారీ ప్రాంతం’ (నిమ్జ్) కోసం తీసుకున్న రుణం నుంచి ‘తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’ (టీజీఐఐసీ) రూ.317.49 కోట్లను దారి మళ్లించిందని కాగ్ తప్పు పట్టింది. భూసేకరణ కోసం ‘గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ’ (హడ్కో) నుంచి టీజీఐఐసీ తీసుకున్న రూ.725 కోట్ల రుణం నుంచి 317.49 కోట్లను మళ్లించారని తెలిపింది. నిమ్జ్‌లో మార్గదర్శకాలకు వ్యతిరేకంగా 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలను ఓ సంస్థకు కేటాయించిందని, పర్యవసానంగా టీజీఐఐసీ రూ.106.91 కోట్లను నష్టపోయిందని కాగ్ ఎత్తిచూపింది. మరోవైపు, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్ పార్కులో 20 ఎకరాల భూమిని అప్పటి ధర ఎకరాకు రూ.2.13 కోట్లకు బదులుగా ఎకరాకు రూ.40 లక్షల చొప్పు కేటాయించటం వల్ల ఆయా సంస్థలకు రూ.34.60 కోట్ల మేర టీజీఐఐసీ అనుచిత లబ్ధిని చేకూర్చింది. ఎలకా్ట్రనిక్ వ్యవస్థ రూపకల్పన, తయారీ పార్కులో 39 సంస్థలకు 165.21 ఎకరాలను కేటాయించటం ద్వారా రూ.208.24 కోట్ల అనుచిత లబ్ధిని చేకూర్చినట్లయిందని కాగ్ తెలిపింది. గచ్చిబౌలిలో ఒక మొబైల్ కంపెనీకి ఎకరా భూమిని అప్పటి రేటు రూ.14.52 కోట్లకు బదులుగా రూ.10.05 కోట్లకు ధారాదత్తం చేసింది. అక్కడే మరో మొబైల్ కంపెనీకి అదే రేటు రూ.10.05 కోట్లతో 2.68 ఎకరాలను కేటాయించింది. మంఖాల్ ప్లాస్టిక్ పార్కు కోసం 23 ఎకరాల భూమిని అంచనా వేసినప్పటికీ.. 29.87 ఎకరాలను రాయితీ ధరకు కేటాయించారు. వీటన్నింటి వల్లా టీజీఐఐసీకి కోట్లలో నష్టం వాటిల్లింది.