23న క్యాబినెట్ సమావేశం
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:27 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది.
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ ప్రారంభంపై చర్చ
పరిషత్ ఎన్నికలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఆర్టీసీ సమ్మె,ఉద్యోగుల సమస్యలు, యాసంగి ధాన్యం సేకరణపైనా
మెట్రోరైలు మొదటి దశ స్వాధీనంపైనా చర్చించే చాన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి అవసరమైన సమాచారంతో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతోంది. జూన్ 12న ముగియనున్న ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలు నిర్ణయాలను ప్రకటించనుంది.
క్యాబినెట్ భేటీలో చర్చించనున్న అంశాలు..
జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈసారి బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి రూ.4 వేల కోట్లను కూడా కేటాయించింది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పథకం ప్రారంభ సాధ్యాసాధ్యాలను క్యాబినెట్‌లో పరిశీలించనున్నారు.
మే నెలలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయి.
గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్‌లపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి.. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఈ అంశం చర్చకు రావొచ్చు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం కూడా క్యాబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ, డీఏలను ప్రకటించడం వంటి అంశాలను జేఏసీ లేవనెత్తుతోంది. ఈ సమస్యలపై క్యాబినెట్ చర్చించవచ్చని సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్‌కు ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. అయినా.. రిటైర్ అయిన ఉద్యోగులకు పూర్తి స్థాయి ప్రయోజనాలు అందడం లేదని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుందని సంఘాల నేతలు చెబుతున్నారు.
యాసంగి ధాన్యం సేకరణపై క్యాబినెట్ దృష్టి సారించనుంది. ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను క్యాబినెట్ ఆరా తీయనుంది.
వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాలపై క్యాబినెట్ చర్చించనుంది. నిజామాబాద్ వంటి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసి చేతికొచ్చిన వరి ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. కళ్లాలు, రహదారులపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కుల సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టింది. కులాలవారీగా జనాభా, ఆయా కులాల చేతుల్లో ఉన్న భూమి, పేదరికం వంటి వివరాలను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై క్యాబినెట్ చర్చింనుంది.
మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడం, నిధుల చెల్లింపు అంశంతోపాటు కొత్తగా తీసుకురానున్న రోహిత్ వేముల వివక్ష నిరోధక చట్టంపై చర్చించే అవకాశాలున్నాయి.