Cabinet Approves Land Acquisition: మెట్రో రెండో దశ ముందుకు!
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:40 AM
నగరంలో మెట్రో రెండో దశ పనులు మరింత ముందుకు సాగనున్నాయి. ప్రాజెక్టుకు సంబందించి కావాల్సిన భూ సేకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
భూ సేకరణ చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయం
హైదరాబాద్ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నగరంలో మెట్రో రెండో దశ పనులు మరింత ముందుకు సాగనున్నాయి. ప్రాజెక్టుకు సంబందించి కావాల్సిన భూ సేకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆదివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి ఆమోదించారు. వాస్తవానికి రెండో దశ పార్ట్-ఏ, పార్ట్-బీ కలిపి మొత్తం 162.5 కిలోమీటర్లు చేపట్టాలని నిర్ణయించి గతంలో జరిగిన క్యాబినెట్ భేటీలోనే ఆమోదం తెలిపారు. ఈ మేరకు డీపీఆర్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రెండో దశలో చేపడుతున్న 8 కారిడార్లకుగాను మొత్తం రూ.43,719 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కారిడార్ల కోసం భూసేకరణ సమస్య పెద్దగా లేకపోవడంతో పనులు సకాలంలో ముందుకు సాగనున్నాయి. కేవలం రెండు, మూడు మార్గాల్లోనే భూ సేకరణ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి డీపీఆర్‌కు ఆమోదం వచ్చేలోపు కావాల్సిన చోట భూ సేకరణ పనులు త్వరగా చేయాలని తాజాగా క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. రూ.2,787 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రెండో దశలో ప్రతిపాదించిన ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట మార్గంలో 65 శాతం భూ సేకరణ పూర్తయింది. తాజాగా కేటాయించిన నిధులతో ఈ పనులు మరింత ముందుకు సాగనున్నాయి.