kumaram bheem asifabad- బైబై గణేశా..
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:11 PM
ఒకవైపు డప్పుల శబ్ధం.. మరో వైపు జైజై గణేశా, గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు. విగ్రహాల ముందు చిందేస్తున్న యు వత. ఇలా శుక్రవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆయా కూడళ్లలో గణనాథుల విగ్రహా లు ప్రతిష్ఠించిన భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కన్నుల పండువగా శోభాయాత్రలు
- తెల్లవారుజాము వరకు ఆటాపాటలు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్/వాంకిడి/సిర్పూర్(యు), సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు డప్పుల శబ్ధం.. మరో వైపు జైజై గణేశా, గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు. విగ్రహాల ముందు చిందేస్తున్న యు వత. ఇలా శుక్రవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆయా కూడళ్లలో గణనాథుల విగ్రహా లు ప్రతిష్ఠించిన భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన అనంతరం శుక్రవారం గణనాథుల ప్రతిమలకు భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం అంగరంగ వైభవంగా మొదలైన శోభాయాత్రలు తెల్లవారు జాము వరకు కొనసాగాయి. పూజల అనంతరం ఉత్సవ కమిటీల సారధ్యంలో వాహనాలను విద్యుద్దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించి అందులో విఘ్నేశ్వరులను నిలిపారు. వినాయక నిమజ్జన వేడుకల్లో కళాకారుల కోలాటాలు, డప్పుచప్పుళ్ల నడుమ స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వినాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకుగానూ వాహనాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ శోభాయాత్ర పట్టణ ప్రదాన వీదుల గుండా కొనసాగింది. అనంతరం గొడవెల్లి పెద్దవాగులో గణనాథులను నిమజ్జనం చేశారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా ఎస్పీ నితికాపంత్ నేతృత్వంలో డీఎస్పీ అశోక్, సీఐ నీలం రవి ఆధ్వర్యంలో పోలీసులుబందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దవాగు వద్ద వినాయక విగ్రహలను నిమజ్జన చేసేందుకు క్రేన్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులను కలుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కాగజ్‌నగర్ పట్టణంలో 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన శోభాయాత్రలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, తహసిల్దార్ మధూకర్, విశ్వ హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు తాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణనాథుడికి శాస్త్రోక్తంగా వేద పండితుడు నరహరి శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో డీఎస్పీ వహిదుద్దీన్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆద్వర్యంలో పెద్దవాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేశారు. లారీ చౌరస్తాలో ఎమ్మెల్యే హరీష్‌బాబు, వసుంధర కళాశాల సమీపంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, థియేటర్ సమీపంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు. వయో బేధం లేకుండా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పెద్దవాగులో నిమజ్జనం చేసే ప్రక్రియలో డీఎస్పీ వహిదుద్దీన్, సీఐ కుమార్‌స్వామి ఏర్పాట్లు చేశారు. పెద్దవాగులో నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో తగిన చర్యలు తీసుకున్నారు. వాంకిడి, మండలంలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని శుక్రవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సిర్పూర్(యు) మండల కేంద్రంలోని సార్వజనిక గణేశ్ మండలి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు ముగిశాయి.