Share News

ఏజెన్సీలో అకాడి సందడి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:07 PM

ఆధునిక శైలి ఎంత వేగంగా మారుతు న్నా,.. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటు న్నారు. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలు పాటిస్తూ వాటిని భావి తరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నారు. ఆషాఢ మాసంలో జరిగే అకాడి పూజలతో ఆదివాసీల పండుగల పరంపర మొదలై దీపావళి వరకు కొనసాగుతుంది.

ఏజెన్సీలో అకాడి సందడి
లెండిజాలలో వనదేవతకు మొక్కుతున్న ఆదివాసీలు

  • భక్తిశ్రద్ధలతో కుల దైవాలకు ప్రత్యేక పూజలు

జైనూర్‌/సిర్పూర్‌(యు), జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆధునిక శైలి ఎంత వేగంగా మారుతు న్నా,.. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటు న్నారు. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలు పాటిస్తూ వాటిని భావి తరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నారు. ఆషాఢ మాసంలో జరిగే అకాడి పూజలతో ఆదివాసీల పండుగల పరంపర మొదలై దీపావళి వరకు కొనసాగుతుంది. దింతో నాలుగు నెలల పాటు గిరిజన గూడాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ప్రతి ఆదివాసీ గూడాల్లో కొనసాగుతున్న ఆచారం ఏ పండుగైన ప్రకృతితో మమేకమై జరుపుకోవడం ఆదివాసీల ప్రత్యేకత. పుడిమి తల్లిని, దేవతలను ఆరాధిస్తు ప్రకృతి ప్రసాదించే జీవనాధారాలపై కృతజ్ఞతను చాటుకుంటారు. నే పథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజేన్సి ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో అకాడి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఏటా వర్షాకాలం ప్రారంభంలో..

ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే విత్తనాలు నాటిన అనంతరం ఆదివాసీలు వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు వ్యాధులు, వన్య మృగాల బారిన పడకుండా ఉండాలని అడవికి వెళ్లే ప్రజలకు ఎలాంటి అపాయం కలగకుండా చూడాలని ప్రార్థిస్తూ వన దేవతలకు వేడుకుంటారు. జిల్లాలోనిజైనూర్‌, సిర్పూర్‌ (యు), లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి తదితర మండలాల గిరిజన డూడాల్లో అకాడి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గ్రామ సమీంలోని అడవిలో ఉన్న ఇప్ప చెట్టు వద్ద వన దేవతగా భావించే రాజూల్‌ పేన్‌కు ప్రత్యే పూజలు చేస్తారు. ఈ పూజల్లో పురుషులు మాత్రమే పాల్గొనడం ప్రత్యేకత. అనంతరం అడవిలో ఒక గీత గీసి దాన్ని పశువులతో దాటిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా తమ పాడి పశువులను వన దేవత కాపాడుతుందనే విశ్వాసం ఆదివాసీల్లో బలంగా ఉంది. పూజలు పూర్తయిన తర్వాత అదే ప్రదేశంలో సామూహికంగా వంటలు చేసి సహ పంక్తి భోజనాలు చేస్తారు. గ్రామస్థులంతా కలిసి భోజనం చేయడం ద్వార ఐక్యత, సోదర భావాన్ని చాటుకుంటారు. అనంతరం వన దేవత ఆశీస్సులతో తమ తమ గూడాలకు తిరిగి వెళ్తారు. అకాడి పూజలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీ జీవన తత్వానికి ప్రతీక. మారుతున్న కాలంలోనూ తమ మూలాలను మరువకుండా సంస్కృతి, సంప్రదా యాలను కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్న ఆదివాసీల జీవన విధానం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Updated Date - Jul 20 , 2026 | 07:50 AM