కళ్లముందే కాలిపోయి..
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:00 AM
అందరూ చూస్తుండగానే క్షణాల్లో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటి వరకు అక్కడే తిరిగి అందరితో మాట్లాడిన ఆ ఇద్దరూ కళ్లముందే చనిపోవడంతో వారంతా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. దండేపల్లి మండలం మ్యాదరిపేటలో సోమవారం ఓ పెట్రోల్ బంకు నుంచి ఐరన్ స్టాండ్ తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం..
దండేపల్లి మండలం మ్యాదరిపేటలో విషాదం
దండేపల్లి, మార్చి 9 (ఆంద్రజ్యోతి): అందరూ చూస్తుండగానే క్షణాల్లో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటి వరకు అక్కడే తిరిగి అందరితో మాట్లాడిన ఆ ఇద్దరూ కళ్లముందే చనిపోవడంతో వారంతా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. దండేపల్లి మండలం మ్యాదరిపేటలో సోమవారం ఓ పెట్రోల్ బంకు నుంచి ఐరన్ స్టాండ్ తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాదరిపేట గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు(35) హరిహార ట్రేడర్స్‌లో బోలెరో వాహన డ్రైవర్‌గా, మదాపూర్ గ్రామానికి చెందిన చల్ల లక్ష్మినారాయణ(45) హమాలీగా పని చేస్తున్నారు. ట్రేడర్స్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు యజమాని సోమవారం వీరిద్దరినీ పిలిచి పెట్రోల్ బంకులో ఉన్న ఐరన్ స్టాండ్‌ను తన ఇంటికి తరలించాలని వారికి చెప్పాడు. యజమాని చెప్పినట్లు ఐరన్ స్టాండ్‌ను అక్కడి నుంచి తరలిస్తుండగా 11కేవీ విద్యుత్ తీగలకు స్టాండ్ తగలడంతో ఒక్కసారిగా షాక్ కొట్టి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నాగరాజు, లక్ష్మీనారాయణ ఇద్దరూ షాక్‌కు గురై శరీరాలు కాలిపోయి దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న నాగరాజు బావ వారిని రక్షించే ప్రయత్నం చేసి అతడూ స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రి తరలించారు. సమాచారం అందుకున్న దండేపల్లి ఎస్సై ఎండి తైహసీనొద్దిన్ సిబ్బందితో అక్కడి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఆవేశంలో పెట్రోల్ బంకు అద్దాలను ధ్వంసం చేశారు. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి..
వాహన డ్రైవర్ నాగరాజుకు భార్య మౌనిక, ఎడాది బాబు ఉన్నారు. ప్రస్థుతం మౌనిక ఐదు నెలల గర్బవతి. నాగరాజు పనికి వెళ్తేనే వారి కుటుంబం గడిచేది. ఇప్పుడు నాగరాజు మృతితో ఆయన భార్య మౌనిక కన్నీళ్లపర్యంతమవుతోంది. ఇక లక్ష్మినారాయణ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. లక్ష్మినారాయణకు భార్య నరసమ్మ, కూతురు ఉన్నారు. కూరుతు ప్రస్తుతం పదో తరగతి చదువుకుంటోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి కూతురిని చదివిస్తున్నారు. లక్ష్మినారాయణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది.
బంక్ యజమాని ఇంటి ఎదుట ఆందోళన
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్థులు బంక్ యజమాని ఇంటి ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాలను తొలగించే ప్రసక్తి లేదని అక్కడే బైఠాయించారు. దీంతో ఇరు గ్రామాల పెద్ద మనుఘల సమక్ష్యంలో బంక్ యజమానితో చర్చలు జరిపారు. పరిహారం చెల్లించడానికి బంక్ యజమాని అంగీకరించడంతో ఆందోళన విరమించారు.