వీలునామా నిజమైనదని నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్లదే: హైకోర్టు
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:38 AM
వీలునామా నిజమైనదని నిరూపించాల్సిన బాధ్యత దాని ద్వారా హక్కులు కోరుతున్నవారిపైనే ఉంటుందని హైకోర్టు పేర్కొంది. విల్ ప్రామాణికతపై....
వీలునామా నిజమైనదని నిరూపించాల్సిన బాధ్యత దాని ద్వారా హక్కులు కోరుతున్నవారిపైనే ఉంటుందని హైకోర్టు పేర్కొంది. విల్ ప్రామాణికతపై అనుమానాలున్నప్పుడు బలమైన సాక్ష్యాలు చూపాల్సిన అవసరం వారిపైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఓ కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 1964లో రాసినట్లు పేర్కొంటున్న విల్ దశాబ్దాలపాటు బయటకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. తండ్రి 1979లో, తల్లి 1999లో మరణించిన తర్వాత మాత్రమే విల్ దొరికిందన్న వాదన నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడింది. ఆరుగురు కుమార్తెలున్నా విల్‌లో ఐదుగురి పేర్లే ప్రస్తావించడంఅనుమానాస్పదమని పేర్కొంది. హైదరాబాద్‌లోని ఫీల్ఖానా ప్రాంతంలోని 275 చదరపు గజాల విస్తీర్ణంలోని ఇంటి హక్కుపై కుటుంబసభ్యుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఫీల్ఖానాకు చెందిన డాక్టర్ ప్రభుజీ పతంగే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.