Share News

kumaram bheem asifabad- నిర్మించారు.. వదిలేశారు..

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:30 PM

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, యువకులు క్రీడల్లో రాణించాలనే ఆశయంతో నిర్మాణాలు చేపట్టిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో 303 క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు క్రీడా ప్రాంగణాల కోసం 1.80 కోట్లు వెచ్చించారు. లక్షలాది రూపాయలు వెచ్చించిన వీటిలో క్రిడా పరికరాలు సమకూర్చక, నిర్వాహణ లేక అవి నిరూపయోగంగా మారుతున్నాయి.

kumaram bheem asifabad-  నిర్మించారు.. వదిలేశారు..
క్రీడా పరికరాలు లేని జైనూర్‌లోని క్రీడా ప్రాంగణం

జైనూర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, యువకులు క్రీడల్లో రాణించాలనే ఆశయంతో నిర్మాణాలు చేపట్టిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో 303 క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు క్రీడా ప్రాంగణాల కోసం 1.80 కోట్లు వెచ్చించారు. లక్షలాది రూపాయలు వెచ్చించిన వీటిలో క్రిడా పరికరాలు సమకూర్చక, నిర్వాహణ లేక అవి నిరూపయోగంగా మారుతున్నాయి. రెండు నెలలుగా జిల్లాలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. విద్యార్థులు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం సీఎం కప్‌ గ్రామీణ పోటీలు ముగిశాయి. జిల్లా స్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. ఆసక్తి గల వారు పాల్గొంటూ పతకాలతో మెరుస్తున్నారు. కానీ గ్రామాల్లో ఏర్పాటైన క్రీడా ప్రాంగణాలు అటువంటి వారికి ఉపయోగ పడకుండా పోతున్నాయి. అవి చాల వరకు గ్రామాలకు దూరంగా ఉండడం, పరికరాలు లేక పోవడం.. తదితర కారణాలతో అటు వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొన్నది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 15 మండలాల్లో ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రీడా ప్రాంగణాలకు కేటాయించింది. గత ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో దానికి రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు నిధులు వెచ్చించింది. దీంతో పాటు ఒక్కో క్రీడా ప్రాంగణంలో రెండు వ్యాయామ బార్లు ఏర్పాటు చేశారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో నిర్మించిన ఈ ప్రాంగణాల్లో క్రీడా పరికరాలు లేక అటు వైపు చూసే వారు లేకుండా పోయారు. కనీసం ఒక్క దాంట్లోనూ సామగ్రి ఏర్పాటు చేయక పోవడం గమనార్హం. దీంతో పాటు నిర్వాహణ కరవై చాల చోట్ల పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంగణాల్లో క్రీడా సామగ్రి ఏర్పాటు చేసినట్లయితే గ్రామీణ ప్రాం తాల్లోని యువత క్రీడల్లో రాణిస్తారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా చర్యలు తీసుకుంటే యువతకు ప్రయోజనం చేకూరనుంది.

Updated Date - Mar 03 , 2026 | 10:30 PM