Share News

చీరలతో బ్రాండ్‌ ఇమేజ్‌..

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:15 AM

నిత్యం ఆకలి చావులు, ఆత్మహత్యలను చవిచూసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ చీరల ఉత్పత్తి బ్రాండ్‌ ఇమేజ్‌గా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడపడుచులకు బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో సిరిసిల్ల నేత కుటుంబాల్లో విషాద సంఘటనలకు తెరపడింది. చీరలకు తోడుగా ప్రభుత్వ ఇతర వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో చేతినిండా పని, కడుపునిండా ఉపాధిగా

చీరలతో బ్రాండ్‌ ఇమేజ్‌..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

నిత్యం ఆకలి చావులు, ఆత్మహత్యలను చవిచూసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ చీరల ఉత్పత్తి బ్రాండ్‌ ఇమేజ్‌గా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడపడుచులకు బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో సిరిసిల్ల నేత కుటుంబాల్లో విషాద సంఘటనలకు తెరపడింది. చీరలకు తోడుగా ప్రభుత్వ ఇతర వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో చేతినిండా పని, కడుపునిండా ఉపాధిగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ చీరల పేరుతో పంపిణీ చేస్తున్న చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులకు ఉపాధికి ఇబ్బంది లేకుండా మారింది. ఇందిరమ్మ చీరల కోసం ఇచ్చిన రూ.334 కోట్ల వ్యయంతో 6కోట్ల33 లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు పూర్తి చేశారు. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో ఇప్పుడు తమిళనాడు చీరల సందడి మొదలైంది. తెలంగాణ ప్రభుత్వ చీరలు ఆర్డర్ల ద్వారా సంవత్సరంలో దాదాపుగా 8 నెలల పాటు నేత కార్మికులకు పనులు లభిస్తున్నాయి. మిగతా మూడు నెలలు తమిళనాడు నుంచి వచ్చే చీరల ఆర్డర్లు పని కల్పిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆడపడుచులకు చీరలు, పురుషులకు దోతీలు అందించే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతోంది. తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా అందించే 2.27 కోట్ల చీరలు, 2.23 కోట్ల దోతిల ఉత్పత్తికి రూ.642.88 కోట్లు ఖర్చు చేస్తోంది. తమిళనాడులోని ఈరోడ్‌, తిరుప్పూర్‌, సేలం, కోయంబత్తూర్‌ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని మరమగ్గాల పరిశ్రమలకు తమిళనాడు చేనేత, జౌళి శాఖ పర్యవేక్షణలో ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో భాగంగా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 10లక్షల నుంచి 20 లక్షల వరకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడు చీరల ఉత్పత్తికి డిసెంబరు 15 వరకే గడువు ఉండడంతో సిరిసిల్లలో ఉత్పత్తి వేగంగా జరుగుతోంది. కాటన్‌ చీరలు యువతల కోసం, పాలిస్టర్‌ చీరలు 60 ఏళ్ల పైబడిన మహిళ కోసం ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో తమిళనాడు చీరల ఉత్పత్తితో కార్మికుడు నెలకు రూ.12వేల వరకు వేతనం పొందుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఇందిరమ్మ చీరల ఆర్డర్లు పూర్తవుతున్న సమయంలో తమిళనాడులో సంక్రాంతికి అందించే పొంగల్‌ చీరలు నేతన్నకు ఉపాధికి తోడుగా నిలిస్తోంది.

చీరల పంపణీకి స్ఫూర్తినిచ్చిన ‘పొంగల్‌’ చీరలు

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా అందిస్తున్న చీరల ఉత్పత్తికి తమిళనాడులో అమ్మచీరల పంపిణీతోనే బీజం పడిందని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పడుగు, పేకలు ఉరితాళ్లు పేనుతున్న క్రమంలో కార్మికులకు ఉపాధిని అందిస్తూ తమిళనాడులో పంపిణీ చేసే చీరల ఉత్పత్తి సిరిసిల్లలో మొదలైంది. 2014 నుంచి సిరిసిల్ల మరమగ్గాలపై నిరంతరంగా తమిళనాడు చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆంధ్రాలోని గుంటూరుకు చెందిన వస్త్రవ్యాపారి ఎస్‌ రామారావు 2012లో మొదట కాటన్‌ చీరలను సిరిసిల్ల మరమగ్గాలపై తయారీకి ఊతం ఇచ్చారు. కాటన్‌ సైజింగ్‌లు లేకపోవడంతో మానుకున్నారు. 2014లో తమిళనాడులో పొంగల్‌ చీరల పంపిణీలో ఉపయోగించే పాలిస్టర్‌ చీరల తయారీ ఆర్డర్‌ను తీసుకువచ్చారు. సిరిసిల్ల మరమగ్గాలపై ఉత్పత్తికి అవకాశం కల్పించారు. ఆత్మహత్యలు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో కార్మికులకు కొంత ఉపాధి లభించింది. అదే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్న కే తారకరామారావు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మంచిరోజులు తేవాలని కార్మికులకు చేతినిండా పని కల్పించడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళనాడులో అమ్మ చీరలు పంపిణీ చేసినట్లు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి పరిశీలించారు. 2017లో సిరిసిల్లలో తయారవుతున్న చీరలను పరిశీలించారు. తెలంగాణలో ఆడపడుచులను ఆకర్షించే విధంగా ప్రతి సంవత్సరం విభిన్నమైన రంగుల్లో బతుకమ్మ చీరలను 2023 సంవత్సరం వరకు అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం రెండు చీరలు చొప్పున మహిళలకు అందించాలని లక్ష్యంతో చీరల ఉత్పత్తి కోసం రూ.334 కోట్ల నిధులతో 6.33 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించారు. ఇందిమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి 133 మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(మ్యాక్స్‌)ల ద్వారా 11వేల మరమగ్గాలపైన ఉత్పత్తి జరిగింది. చీరల ఆర్డర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రెండో చీర పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. మొదటి విడతలో ‘పాలపిట్ట’ రంగు డిజైన్‌ చీరలను పంపిణీ చేయగా రెండో చీర చిలకపచ్చ రంగు డిజైన్లు చూడముచ్చటగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. మొదటిసారి పాలపిట్ట రంగు చీరను కేవలం స్వశక్తి సంఘాల్లో ఉన్న సభ్యులకు మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి రేషన్‌ కార్డులో ఉన్న కుటుంబంలోని 18ఏళ్లు నిండిన మహిళలందరికీ ఈసారి చీరలను ఇవ్వనున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:15 AM