Budget Sessions: మున్సిపోల్స్.. ముగియగానే బడ్జెట్ సమావేశాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:52 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం...
ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం రేవంత్ సభలు
ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల బిజీ
ఫిబ్రవరి చివరి వారంలో సమావేశాలు నిర్వహించే ఛాన్స్
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటుగా పథకాన్నీ నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాల వారీగా ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ములుగులో నిర్వహించనున్న సభకు ఏఐసీసీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలూ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఫిబ్రవరి నాలుగో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఆ బడ్జెట్ ఆధారంగా కేంద్రం నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు ఏమేరకు నిధులు వస్తాయన్నది అంచనా వేసి.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించనుంది. ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తే.. వెసులుబాటు దొరికి కచ్చితమైన అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించుకోవడానికి వీలు దొరుకుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.