సీనియర్ల ర్యాగింగ్, హెచ్‌వోడీ మందలింపుతో..
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:45 AM
సీనియర్ల ర్యాగింగ్, హెచ్‌వోడీ మందలింపుతో మనస్థాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి కన్నతల్లి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సీనియర్ల ర్యాగింగ్, హెచ్‌వోడీ మందలింపుతో మనస్థాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి కన్నతల్లి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన గంట కళ్యాణ్ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐఎంఎల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువులో చురుకైన విద్యార్థి, అయితే కొంతకాలంగా సీనియర్లు ర్యాగింగ్‌లో భాగంగా కళ్యాణ్‌తో బలవంతంగా సిగరెట్లు తెప్పించేవారు. బుధవారం ఈ విషయాన్ని గమనించిన హెచ్‌వోడీ.. కళ్యాణ్ తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించారు. గురువారం తల్లితో కలిసి కళాశాలకు వచ్చిన కళ్యాణ్‌ను.. సిగరెట్ల విషయంలో అందరిముందు మందలించారు. దీంతో అవమానంగా భావించిన ఆ యువకుడు వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి కళాశాల మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణ్‌ను కళాశాల సిబ్బంది నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే కళ్యాణ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్ చేశారు.