Share News

ఉచితంగా జర్మన్‌, జపనీస్‌..రండి.. మా కాలేజీలో చేరండి

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:52 AM

జర్మన్‌, జపనీస్‌ ఉచితంగా నేర్పుతాం.. రండి.. మా కాలేజీలో చేరండి..’ బీఎస్సీ నర్సింగ్‌లో చేరే విద్యార్థులకు ప్రైవేటు కాలేజీల ఆఫర్‌ ఇది.

ఉచితంగా జర్మన్‌, జపనీస్‌..రండి.. మా కాలేజీలో చేరండి

  • బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ప్రైవేటు కాలేజీల ఆఫర్‌

  • నర్సింగ్‌ అభ్యర్థులకు విదేశాల్లో ప్రాధాన్యం

  • దీంతో విదేశీ భాషలు నేర్పే సంస్థలకు డిమాండ్‌

  • ప్రభుత్వ కాలేజీల్లో జపనీస్‌, జర్మన్‌ బోధన

  • అదే బాటలో ప్రైవేటు కాలేజీలు

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘జర్మన్‌, జపనీస్‌ ఉచితంగా నేర్పుతాం.. రండి.. మా కాలేజీలో చేరండి..’ బీఎస్సీ నర్సింగ్‌లో చేరే విద్యార్థులకు ప్రైవేటు కాలేజీల ఆఫర్‌ ఇది. బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారికి విదేశాల్లో మంచి ప్రాధాన్యం ఉండటంతో.. జర్మన్‌, జపనీస్‌ నేర్చుకోవడంపై ఆసక్తి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నర్సింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే ఆ భాషలను బోధిస్తుండటంతో విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీనితో ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీల యాజమాన్యాలు కూడా ఈ రెండు భాషల బోధనను ప్రవేశపెట్టాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 37 నర్సింగ్‌ కాలేజీల్లో జర్మన్‌, జపనీస్‌ భాషల బోధనను ప్రారంభించింది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో భాగంగా విదేశీ భాషను తప్పనిసరి చేసింది. ఈ భాషల బోధన కోసం ఇఫ్లూతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా బోధన కొనసాగుతోంది. దీనితో ఈ 37 కాలేజీల్లోని 2,320 సీట్లు హాట్‌కేకుల్లా నిండిపోయాయి. ఇక ప్రైవేటులోని 95 బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలల్లో 5,650 సీట్లున్నాయి. అందులో 60శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కిందకు వెళ్తాయి. మిగతా 40 శాతం సీట్లు (2,260) యాజమాన్య కోటా (బీ కేటగిరీ) కిందకు వస్తాయి. నిజానికి ఏటా ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలిపోయేవి. వాటిని నింపుకొనేందుకు యాజమాన్యాలు నానా పాట్లు పడేవి. ఈసారి అందుకు భిన్నంగా బీ కేటగిరీ సీట్లలో చాలావరకు నిండిపోయినట్టు ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌కు డిమాండ్‌ పెరగడం.. జర్మన్‌, జపనీస్‌ భాషల బోధన చేపట్టడమే దీనికి కారణమని అంటున్నాయి. ప్రైవేటు కాలేజీలు బీఎస్సీ నర్సింగ్‌ మూడో ఏడాది చదువుతున్న వారికి ఈ రెండు భాషలను బోధిస్తున్నాయి. దీనికోసం ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను నియమించుకున్నాయి. సదరు ఏజెన్సీలే జర్మన్‌, జపనీస్‌ అధ్యాపకులను సమకూర్చుకు ని, విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి.


ఇక్కడా, విదేశాల్లో వారికే డిమాండ్‌

నర్సింగ్‌ కోర్సుల్లో.. జీఎన్‌ఎం(జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) సర్టిఫికెట్‌ కోర్సు కాగా.. ఏఎన్‌ఎమ్‌ (ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌వైఫరీ) డిప్లొమా కోర్సు. వీటికి పెద్దగా డిమాండ్‌ ఉండటం లేదని కాలేజీలు అంటున్నాయి. అదే బీఎస్సీ నర్సింగ్‌ అయితే డిగ్రీ కోర్సు, దాని తర్వాత ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. అవసరమైతే అధ్యాపక వృత్తి వైపు వెళ్లే అవకాశం ఉండటంతో డిమాండ్‌ నెలకొందని పేర్కొంటున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారికి విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి.

మా కాలేజీలో 100 మందికి జర్మన్‌ నేర్పుతున్నాం

మా కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ మూడో ఏడాది విద్యార్థులు 100 మందికి జర్మన్‌ నేర్పుతున్నాం. త్వరలో జపనీస్‌ కూడా అందుబాటులోకి తీసుకువస్తాం. జర్మనీ, జపాన్‌ దేశాల్లో నర్సింగ్‌ ఆఫీసర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. మన కరెన్సీ ప్రకారం చూస్తే నెలకు రెండున్నర నుంచి మూడు లక్షల వేతనం ఇస్తున్నారు. అందుకే ఆ భాషలు నేర్చుకున్న వారికి బంగారు భవిష్యత్‌ ఉంటోంది.

- సాంబిరెడ్డి, కేర్‌ నర్సింగ్‌ కాలేజీ, హైదరాబాద్‌

Updated Date - Jan 27 , 2026 | 03:52 AM