Share News

కాళేశ్వరంపై ఎలా ముందుకెళదాం?

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:45 AM

కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళదాం? ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఏం చేద్దాం? అనే అంశాలపై సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం సుదీర్ఘంగా చర్చించింది.

కాళేశ్వరంపై ఎలా ముందుకెళదాం?

  • ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఏం చేద్దాం?.. ఢిల్లీలో సుప్రీం న్యాయవాదులతో హరీశ్‌ బృందం భేటీ

  • జగిత్యాల సభకు హరీశ్‌ దూరంపై రాజకీయ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళదాం? ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఏం చేద్దాం? అనే అంశాలపై సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం సుదీర్ఘంగా చర్చించింది. కాళేశ్వరం కమిషన్‌పై ఈ నెల 22న హైకోర్టు తుదితీర్పు రానున్న నేపథ్యంలో హరీశ్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చారు. తొలుత సుప్రీంకోర్టు న్యాయవాది, ఏవోఆర్‌ మోహిత్‌ రావుతో గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం సుప్రీం సీనియర్‌ న్యాయవాది శేషాద్రి నాయుడుతోనూ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. తర్వాత మరో సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరంతో వివిధ అంశాలపై మంతనాలు జరిపారు. కోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా వస్తే, తదుపరి అడుగు ఎటు వేయాలన్నదే ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారింది. తీర్పులోని లోపాలను ఏ విధంగా సవాల్‌ చేయాలి? న్యాయపోరాటాన్ని ఏ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశాలపై మేధోమథనం సాగింది. సుప్రీంకోర్టులో గతంలో వెలువడిన తీర్పులు, రాజ్యాంగబద్ధమైన నిబంధనలను ఉటంకిస్తూ ఏయే అంశాలపై గట్టిగా వాదించవచ్చుననేది చర్చించారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎంత వేగంగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలి? అందుకు పత్రాలను ఎలా సిద్ధం చేసుకోవాలి? అనే దానిపై న్యాయ నిపుణులు దిశానిర్దేశం చేశారు. తీర్పు పార్టీకి అనుకూలంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందనే అంశంపైనా కీలకంగా చర్చ జరిగింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ‘కెవియట్‌’ దాఖలు చేస్తే, తమ వాదన వినకుండా స్టే ఇవ్వకూడదని కోరేందుకు సిద్ధమవుతోంది.


ఇక బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అంశంపైనా సుప్రీం న్యాయ నిపుణుల తో బీఆర్‌ఎస్‌ బృందం చర్చించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడాన్ని ఇటీవలే హైకోర్టులో బీఆర్‌ఎస్‌ సవాల్‌ చేసింది. ఏప్రిల్‌ 16న విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మే 6లోగా కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యం లో ఎమ్మెల్యేలు ఏఏ అంశాలతో కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం ఉంది? కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించాలి? అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌, గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆధారంగా చర్చ సాగినట్లు సమాచారం. గతంలో మణిపూర్‌, గోవా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్లు తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభాల సమయంలో సుప్రీంకోర్టు అనుసరించిన వైఖరిని బీఆర్‌ఎస్‌ నేతలు న్యాయవాదులకు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని, స్పీకర్‌ కోర్టు నిర్ణయం తెలిపిందని, హైకోర్టుకు వేసవి సెలవులు ముగిశాక కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ బృందానికి న్యాయ నిపుణులు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ బృందం రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరింది.

చట్టపరమైన అంశాల కోసమే ఢిల్లీకి..: ఎంపీ వద్దిరాజు

కాళేశ్వరం, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులపై న్యాయ నిపుణులు శేషాద్రి నాయుడు, ఆర్యమ సుందరంలను కలిసేందుకే తాము ఢిల్లీకి వచ్చామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టతనిచ్చారు. రైతన్నలకు రైతు భరోసా అందకపోవడం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం, యూ రియా కొరతపై హరీశ్‌రావు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక మంత్రి తుమ్మల వ్యక్తిగత విమర్శలకు దిగడం విచారకరమన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులను ఉద్దేశించి తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ చామల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ సభ రోజే సీఎం రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం సందర్శనకు వెళ్లడం వెనుక రాజకీయ దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూనే కేంద్ర మంత్రి ఇంట్లో విందుకు హాజరైన ముఖ్యమంత్రికి, కాంగ్రెస్‌ నేతలకే ’డబుల్‌ గేమ్‌‘, ’మ్యాచ్‌ ఫిక్సింగ్‌‘ రాజకీయాలు అలవాటు అని ఆయన ఎద్దేవా చేశారు.


బీఆర్‌ఎస్‌‌లో ముసలంతోనే హరీశ్‌ ఢిల్లీ పర్యటన: చామల

ప్రజా ఆశీర్వాద సభ పేరిట జగిత్యాలలో సోమవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు హరీశ్‌ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా హరీశ్‌ను పార్టీకి దూరం పెడుతున్నారని, అందులో భాగంగానే జగిత్యాల సభకు ఆయన్ను దూరం చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో... బీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం మొదలైందని, అందుకే హరీశ్‌ రావు ఢిల్లీ పర్యటనకు వచ్చారని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఏడాది తర్వాత బయటకు వస్తుంటే, హరీశ్‌ రావు ఢిల్లీకి వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని, ఆయన అక్కడ ఎవరిని కలిశారో త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు. హరీశ్‌ రావు భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కేసీఆర్‌ ఇంటికి జీవన్‌ రెడ్డి వచ్చినప్పుడూ హరీశ్‌ రావు అక్కడ కనిపించలేదని సందేహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 21 , 2026 | 04:45 AM