Share News

BRSP Leaders File Complaint: రేవంత్‌రెడ్డిపై డీజీపీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:25 AM

ఖమ్మంలో ఆదివారం జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు....

BRSP Leaders File Complaint: రేవంత్‌రెడ్డిపై డీజీపీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో ఆదివారం జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం డీజీపీ కార్యాలయంలో ఏడీజీ మహేశ్‌ భగవత్‌కు ఫిర్యాదు అందజేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో సీఎం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వందమీటర్ల లోతున గోతులు తీసి పాతేస్తాం, ఊర్లల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా దిమ్మలు కూల్చాలంటూ అందరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి హింసను ప్రేరేపించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్వేషపూరిత ప్రసంగాన్ని సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులకు తగిన రక్షణ కల్పించాలని, రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్పీలకు ఫిర్యాదులు చేశారు.

Updated Date - Jan 20 , 2026 | 02:25 AM