గుదిబండలా బీఆర్‌ఎస్ అప్పులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:50 AM
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. అప్పుల భారాన్ని మోపి పోయిందని, ఇప్పుడా అప్పులను తాము చెల్లించాల్సి వస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మోయలేనంత భారం మోపిపోయారు
2014-15లో రూ.7,254 కోట్ల చెల్లింపులు ఉండేవి.. ఇప్పుడు 66,545 కోట్లకు చేరాయి
ఈ వాస్తవాలు చెబితే బీఆర్‌ఎస్ సభ్యులు బడ్జెట్ పుస్తకాన్ని చింపి వాకౌట్ చేశారు
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు భట్టి సమాధానం
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. అప్పుల భారాన్ని మోపి పోయిందని, ఇప్పుడా అప్పులను తాము చెల్లించాల్సి వస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అప్పులను తిరిగి చెల్లిస్తూ తాము ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు చేపడుతూ, పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. దీనిని చూసి ఓర్వలేక బడ్జెట్ కాపీలను చింపి, చెవుల్లో పెట్టుకుని, సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవడం ద్వారా ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. 2026-27 బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చకు భట్టి సమాధానమిచ్చారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాలకు నిధులను కేటాయించామన్నారు. ‘‘2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ వాళ్లు పరిపాలించారు. 2014-15లో అసలు, వడ్డీ కింద రూ.7,254 కోట్ల చెల్లింపులు ఉండేవి. కానీ ఇప్పుడా చెల్లింపులు రూ.66,545 కోట్లకు చేరాయి. ఇలా రాష్ట్రంపై మోయలేనంత భారాన్ని మోపిపోయారు. ఈ అప్పులను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టారా అంటే... కాళేశ్వరానికి పెట్టారు. అది ఏమైందో అందరూ చూశారు. తెచ్చిన అప్పులు రాష్ట్రానికి గుదిబండలా తయారయ్యాయి. ఈ మూడేళ్లలో మొత్తంగా మేము రూ.1,59,165 కోట్ల అప్పు తెస్తే... అసలు, వడ్డీల కింద మేము చెల్లించిన సొమ్ము రూ.1,85.090 కోట్లు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇవన్నీ కడుతూనే ఇరిగేషన్, రోడ్లు, స్కూళ్లు, హైదరాబాద్ అభివృద్ధికి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులిస్తున్నాం. ఈ లెక్కలు, వాస్తవాలను బయటపడితే బీఆర్‌ఎస్ సభ్యులు జీర్ణం చేసుకోలేక... సమాధానం చెప్పలేక బడ్జెట్ పుస్తకం చింపి బయటకు వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక, పరిపాలన వ్యవస్థలను ధ్వంసం చేశార’’ని భట్టి అన్నారు.
వాస్తవిక దృష్టితో బడ్జెట్ పెట్టాం
వాస్తవిక దృష్టితో, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ ప్రవేశపెట్టామని భట్టి చెప్పారు. రైతు భరోసా, చేయూత, మహాలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్పీజీ సిలిండర్, బియ్యం సబ్సిడీ, డైట్ చార్జీలు వంటి పథకాలకు రూ.50 వేల కోట్ల వరకు కేటాయించామన్నారు. రూ.20,617 కోట్లతో రుణ మాఫీ పథకం అమలు చేశామని చెప్పారు. ‘బీజేపీ సభ్యులు చీటింగ్ బడ్జెట్ అంటున్నారు. కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వడం, పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం, స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలకు నిధులు కేటాయించడం, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడం చీటింగ్ అవుతుందా?’ అని భట్టి ప్రశ్నించారు