Minister Tummala: బీఆర్‌ఎస్ పాలనలో రైతులు మోసపోయారు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:27 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులు మోసపోయారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని....
రెండేళ్లలోనే రైతు సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేశాం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులు మోసపోయారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల విమర్శలపై శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన ఘాటుగా స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతు సంక్షేమం కోసం రూ.1.05 లక్షల కోట్లు ఖర్చు చేశామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం రుణమాఫీని పలు విడతలుగా వాయిదా వేసి విఫలమైందని, కానీ తమ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు విజయవంతంగా మాఫీ చేసిందని తెలిపారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.96 కోట్లు మాఫీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రూ.180 కోట్లు మాఫీ చేసిందని వివరించారు. యాసంగి సీజన్‌కు అవసరమైన 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే 4.60 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు అందజేశామని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబరు 31 నాటికే 6 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం నుంచి తెప్పించామని చెప్పారు. పత్తి రైతుల కోసం కేంద్రం తెచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’ విజయవంతం కావడంతో, అదే తరహాలో ‘యూరియా యాప్’ను పైలెట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో పరిశీలిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం చేయడం వారి అజ్ఞానానికే నిదర్శనమని మండిపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడి మరణించిన ఉదంతాలను ప్రజలు మర్చిపోలేదని విమర్శించారు.