డబ్బులతో బీఆర్‌ఎస్ కార్యకర్త హల్‌చల్?
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:51 AM
భూపాలపల్లి 22వ వార్డులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ అభ్యర్థి తన అనుచరులతో డబ్బు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేసినట్టు విమర్శలు వచ్చాయి.
భూపాలపల్లి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి 22వ వార్డులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ అభ్యర్థి తన అనుచరులతో డబ్బు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేసినట్టు విమర్శలు వచ్చాయి. ఒక్కో ఓటకు రూ.5 వేల చొప్పున ముట్టజెప్పేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తను ఒకరిని అక్కడ ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగగా.. తన చేతిలోని రూ.500 నోట్ల కట్టలను కింద పడేసి సదరు కార్యకర్త పరారయ్యాడు. పోలీసులు వెంటనే ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అవి సుమారు రూ.80 వేలు ఉంటాయని తెలిసింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా బీఆర్‌ఎస్ కార్యకర్త పడేసి వెళ్లగా డబ్బులు దొరికిన విషయం వాస్తవమేనని అన్నారు.
‘భగవద్గీత’లో నోట్లు!
భగవద్గీత పుస్తకంలో రూ.500నోట్లు పెట్టుకుని అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం పుస్తకాన్ని చేతబూని పోలింగ్ కేంద్రం వద్ద తచ్చాడుతుండగా గమనించిన పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడిని తనిఖీ చేయగా పుస్తకంలో నోట్లు కనిపించాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క, భూపాలపల్లి 6వ వార్డులో నకిలీ ఓటర్లు ఓటు వేస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.