చైర్మన్ ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:50 AM
మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ నేతల బృందం వినతి పత్రం సమర్పించింది.
ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ నేతల బృందం వినతి పత్రం సమర్పించింది. శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని లీగల్ టీం ఎన్నికల కమిషనర్‌ను కలిసి కీలక అంశాలపై చర్చించింది. తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019 ప్రకారం.. ఎన్నికల ప్రత్యేక సమావేశానికి కనీసం ఒకరోజు ముందు అంటే ఈ నెల 15న సభ్యులకు ఫారం-2 నోటీసులు జారీ చేయాలని తెలిపింది. అయితే.. క్షేత్రస్థాయి అధికారులకు 14వ తేదీనే గడువుగా నిర్ణయిస్తూ కొన్ని అంతర్గత సర్క్యులర్లు జారీ అయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది చట్ట విరుద్ధమని రావుల అన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుల వివరాల సేకరణ, నోటీసుల జారీ ప్రక్రియను ఈనెల 15వ తేదీ వరకు పొడిగించేలా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.