ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠాలు బీఆర్‌ఎస్ సొంతం
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:32 AM
కోర్టు వివాదాలు, రాజకీయ పార్టీల నేతల మధ్య విభేదాలు తదితర కారణాల వల్ల వాయిదా పడి న పలు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలు 51 రోజుల తర్వాత శనివారం జరిగాయి.
ఖానాపూర్ ఎన్నిక నేటికి వాయిదా
మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు
కాంగ్రెస్ అరాచకాలపై గెలిచాం : కేటీఆర్
ఇబ్రహీంపట్నం, మంచిర్యాల, ఖానాపూర్, హైదరాబాద్ ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కోర్టు వివాదాలు, రాజకీయ పార్టీల నేతల మధ్య విభేదాలు తదితర కారణాల వల్ల వాయిదా పడి న పలు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలు 51 రోజుల తర్వాత శనివారం జరిగాయి. ఇందులో రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలు బీఆర్‌ఎస్ సొంతమయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మాత్రం ఆదివారానికి వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ టేకు ల సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలోని 24 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 13 వార్డుల్లో, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఓ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. చైర్మన్ ఎన్నికకు ముందే బీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థి ఆకుల యాదగిరి, కాం గ్రెస్ కౌన్సిలర్లు, ఓ బీజేపీ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. కానీ, 12 మంది బీఆర్‌ఎస్ సభ్యులు, ఓ బీజేపీ సభ్యుడు, స్వతంత్ర అభ్యర్థితో కలిసి 14 మందితో కోరం ఉండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అలాగే, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ కు చెందిన గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐకి చెందిన మిట్టపల్లి సరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో 22 వార్డులుండగా.. బీఆర్‌ఎస్ కు 10సీట్లు, మిత్రపక్షమైన సీపీఐకి 4స్థానాలు దక్కా యి.
అలాగే కాంగ్రెస్‌కు ఏడు సీట్లు లభించగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గుర్రం నర్సయ్య మద్దతుతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 8కి చేరింది. అయితే, చైర్‌పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. బీఆర్‌ఎస్, సీపీఐ మిత్రపక్షాలు కలిసి 14 మంది సభ్యుల హాజరుతో కోరం సరిపోవడంతో అధికారు లు ఎన్నిక పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్ విజయాల పట్ల ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి బీఆర్‌ఎస్ సాధించిన విజయా న్ని ప్రజాస్వామ్య జయకేతనంగా అభివర్ణించారు. ఈ అంశంలో తమ మిత్రపక్షమైన సీపీఐ సహకారం మరువలేమన్నారు.
ఖానాపూర్‌లో కొనసాగిన పార్టీల పోరు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. శనివారం చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశానికి ఐదో వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మేస పోసవ్వ.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి హాజరయ్యారు. అంతకుముందే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను తీసుకొని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్, బీజేపీ కౌన్సిలర్లను తీసుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ వచ్చారు. తొలుత చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నిమ్మల రమేష్ పేరును ప్రతిపాదించగా.. ఆ తర్వాత బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అంకం మౌనిక పేరును ప్రతిపాదించాయి. ఎన్నికల అధికారులు అంకం మౌనిక పేరును మొదట పిలవడంతో కాంగ్రెస్ అభ్యంతరం చెప్పగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆపై, ఎన్నికల అధికారి అభ్యర్థి పేరు చెప్పినప్పుడు మద్దతు తెలుపుతూ మిగిలిన సభ్యులు చేతులు పైకెత్తిన అంశంలోనూ వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సత్యవతి సొమ్మసిల్లి పడిపోగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.