Uttam Kumar Reddy: ఏపీ జలదోపిడీకి దారులు వేసిందే బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:00 AM
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను బీఆర్‌ఎస్ ఏపీ తాకట్టుపెట్టిందని, అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ రాష్ట్రం కోసం తప్పతెలంగాణ....
నీటి హక్కుల్లో రాజీ పడింది ఆ పార్టీయే
రెండేళ్లుగా న్యాయమైన నీటి వాటా కోసం పోరాడుతున్నాం
కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే పెండింగ్‌లో సాగునీటి ప్రాజెక్టులు: ఉత్తమ్
హైదరాబాద్, నల్లగొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను బీఆర్‌ఎస్ ఏపీ తాకట్టుపెట్టిందని, అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ రాష్ట్రం కోసం తప్పతెలంగాణ ప్రయోజనాల కోసం చేసిందేమీ లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ జలదోపిడీకి దారులు పరిచింది బీఆర్‌ఎస్ పార్టీ అని ఆక్షేపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం అంగడిపేటలో మీడియాతో మాట్లాడారు. 2016 సెప్టెంబరులో తొలి అపెక్స్ కౌన్సిల్ (కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాల సీఎంల) సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలు వెయ్యి టీఎంసీలతో ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయని, ఏటా గోదావరిలో 3 వేల టీఎంసీల జలాలు వెళుతున్నాయని అప్పటి సీఎం కేసీఆర్ గుర్తు చేశారని ఆక్షేపించారు. ఆ నీటిని వినియోగించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ప్రయత్నం చేయాలని కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. ఆ తర్వాత 2018 మార్చి 29వ తేదీన జీవో 230ను జారీ చేసిందన్నారు. గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి... అక్కడి నుంచి పెద్ద గంజాం కొమ్మనూరు ద్వారా గుండ్ల కమ్మ రిజర్వాయర్‌లో వేయడం.. అక్కడి నుంచి పెన్నా నదికి చెందిన సంగం బ్యారేజీలో వేసే పథకానికి డీపీఆర్ సిద్ధం చేయడానికి ఏపీ జీవో జారీ చేసిందని తెలిపారు.
ఆ తర్వాత గోదావరి జలాలను పెన్నాకు తరలించే తొలిదశకు రూ.6020.15 కోట్లతో 2018 జూన్ 13వ తేదీన జీవోనెం.51ను జారీ చేసిందని, దీనిపై అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏ రోజూ తప్పుపట్టడం కానీ, నిరసన తెలుపడం కానీ చేయలేదని మండిపడ్డారు. గోదావరి -పెన్నా అనుసంధానంలో భాగంగా 2019 జనవరి 1వ తేదీన రూ.2281.29 కోట్లతో ఏపీ ప్యాకేజీ-1కు ఒప్పందం చేసుకుందని, ఇందులో రూ.467.87 కోట్లు, ఆ తర్వాత ప్యాకేజీ-2 కింద 2018 నవంబరు 24న రూ.2655.89 కోట్లతో ఒప్పందం చేసుకుంటే.. రూ.551.54 కోట్ల పనులు ఏపీ చేసిందన్నారు. ఈ రెండు ప్యాకేజీలు పల్నాడు డ్రౌట్ మిటిగేషన్ పథకం కింద చూపించి చేపట్టారన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ 80కి.మీ వద్ద 73 టీఎంసీల వరద జలాలను తరలించడానికి ఈ పథకాన్ని ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఇక 2019 జూన్ 28, ఆగస్టు 2, సెప్టెంబరు 23న ఏపీ సీఎం జగన్‌తో పాటు కేసీఆర్ సమావేశమై.. గోదావరి, కృష్ణా జలాలను పెన్నానదులకు మళ్లించే అంశంపై చర్చలు చేయలేదా? అని నిలదీశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని ఆరోపించారు. పదేళ్ల పాలనలో పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రాజెక్టులపై పూర్తి నిర్లక్ష్య వైఖరి కొనసాగించడంతోనే పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల పనులు పూర్తికాలేదని ఆరోపించారు. ఏపీతో రెండేళ్లుగా న్యాయపరమైన నీటివాటా కోసం తమ ప్రభుత్వం పోరాడుతోందన్నారు.