Share News

విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద బీఆర్‌ఎస్‌ నిరసనలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:42 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద ఆ పార్టీ నేతలు గురువారం నిరసనలు చేపట్టారు.

విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద బీఆర్‌ఎస్‌ నిరసనలు
thermal

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద ఆ పార్టీ నేతలు గురువారం నిరసనలు చేపట్టారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎ్‌స) వద్ద ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) వద్ద ఎంపీ వద్దిరాజు, మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌) వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్‌ ఫవర్‌ ప్రాజెక్టు (కేటీపీపీ) ఎదుట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. వైటీపీఎస్‌ వద్ద జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బొగ్గు కొరతకు కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. 40లక్షల టన్నుల బొగ్గును ఈ ప్రభుత్వం అమ్ముకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వైటీపీఎస్‌ వద్దకు చేరుకుని విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసమే వైటీపీఎ్‌సను నిర్మించారని ఆరోపించారు. విద్యుత్‌ ఉత్పత్తికి కావల్సిన బొగ్గును 250కిలోమీటర్ల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. పాల్వంచ, మణుగూరు విద్యుదుత్పత్తి కేంద్రాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లను నడపలేని దద్దమ్మ ప్రభుత్వం ఉందని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.

Updated Date - Sep 25 , 2026 | 03:42 AM