కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై పోరుబాట
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:47 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని, దాని వెయ్యిరోజుల పాలనా వైఫల్యాలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట చేపడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
సెప్టెంబర్ 2 నుంచి 10వరకు ప్రత్యేక నిరసనలు
బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని, దాని వెయ్యిరోజుల పాలనా వైఫల్యాలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట చేపడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, రాష్ట్ర కార్యవర్గంతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడారు. ఈ వారం రోజుల పోరాటానికి ముందు సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తరఫున ప్రత్యేక ‘చార్జ్‌షీట్’ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజున ఆరు గ్యారంటీల వైఫల్యంపై ధర్నాలు, ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ప్రతి ఇంటికీ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు నిర్వహించడంతో పాటు, హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్యపై నిరసనలు చేపడతారు. ఆ తర్వాతి రోజుల్లో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలుపై నిలదీస్తూ వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీలపై యువత, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీలు చేపడతారు. చివరకు 10వ తేదిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్ ప్రతినిధులు పూర్తి మద్దతు తెలపనున్నారు.