బీఆర్‌ఎస్ రాజకీయ నాటకంలో బాల్క సుమన్ బలి: అద్దంకి
ABN , Publish Date - May 31 , 2026 | 05:13 AM
బీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న రాజకీయ నాటకంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు...
దాడులకు పిలుపునిచ్చిన వారిపై పీడీ యాక్ట్: బల్మూరు
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న రాజకీయ నాటకంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘పట్టాలు కోయాలి, దాడులు చేయండి’ అనడం బీఆర్‌ఎస్ భాషకు, కేసీఆర్ రాజకీయ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ తనకు తెలిసిన అరాచక రాజకీయాన్నే తన కొడుకు కేటీఆర్‌కు నేర్పించారని, కేటీఆర్ ఆ నీతిని సుమన్‌కు చెప్పి మాట్లాడించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ హెచ్చరించారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులపై, ప్రజలపై దాడులు చేయాలని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాల్క సుమన్ అరె్‌స్టను రాజకీయంగా చూపిస్తూ.. బీఆర్‌ఎస్ అనవసర హంగామా చేస్తోందని సాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారని టీజీఎల్‌డీఏ కార్పొరేషన్ ఛైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. బాల్క సుమన్ ఒక ఉగ్రవాదిలా, సైకోలా మాట్లాడుతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ధ్వజమెత్తారు. సుమన్‌పై తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
బాల్క సుమన్ వెనుక కేసీఆర్, హరీశ్: గజ్జెల కాంతం
బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల వెనుక కేసీఆర్, హరీశ్‌రావు ఉన్నారని టీపీసీసీ నేత గజ్జెల కాంతం ఆరోపించారు. బీఆర్‌ఎస్ ముసుగులో మిలిటెంట్ కార్యకలాపాలను ప్రొత్సహిస్తున్నారని, ఆ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.