కారు బేజారు!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:20 AM
మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా కారు పార్టీ 17 మునిసిపాలిటీలనే కైవసం చేసుకోగలిగింది.
కార్పొరేషన్లలో జీరో
116 మునిసిపాలిటీల్లో 17 మాత్రమే
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా కారు పార్టీ 17 మునిసిపాలిటీలనే కైవసం చేసుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక.. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాఽధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నూ బోల్తా కొట్టి సిటింగ్ స్థానాలను పోగొట్టుకుంది. మొన్న పంచాయతీ ఎన్నికలు, తాజాగా మునిసిపల్ ఎన్నికల్లోనూ సుమారు 27ు మాత్రమే సీట్లు సాదించింది మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె్‌స 1527 వార్డులను గెలుచుకుంటే బీఆర్‌ఎస్ 774 వార్డుల్లో విజయం సాధించింది. చాలాచోట్ల రెండో స్థానానికి, కొన్నిచోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. కార్పొరేషన్లలో ఒక్కటీ దక్కలేదు. నిజామాబాద్ కార్పొరేషన్‌లోని 60వార్డుల్లో బీఆర్‌ఎస్ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లలో ప్రభావం చూపలేకపోయింది. మక్తల్, కోసిగి, ధర్మపురి, భైంసా మునిసిపాలిటీల్లోనైతే ఖాతా తెరవలేకపోయింది. ఆత్మకూరు, పెద్దపల్లి, నందికొండ, కొడంగ ల్, మంథిని, మదిర, వడ్డేపల్లి, సుల్తానాబాద్, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డునే గెలుచుకుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్, గడ్డపోతారం, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబ్బాకలోని 20 వార్డులలో 11 స్థానాల్లో చేర్యాల మునిసిపాలిటీలో 12 వార్డులకు గాను 7 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది గడ్డిపోతారం మునిసిపాలిటీలో 18 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 14 స్థానాలు దక్కించుకొంది. గుమ్మడిదలలో 22 వార్డుల్లో 15 స్థానాలు, ఇస్నాపూర్‌లో 26 వార్డులకుగాను 12, జిన్నారంలో 20 వార్డులకు గాను 8 వార్డుల్లో గెలిచి గులాబీ పార్టీ తన బలాన్ని చాటుకుంది.
గజ్వేల్, సిరిసిల్లలో గెలుపుతో..
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నగజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను 11 స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది మెదక్ మునిసిపాలిటీ 32 వార్డు ల్లో బీఆర్‌ఎస్ 15 స్థానాలను, తూప్రాన్‌లో 16 స్థానా ల్లో 9 స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మునిసిపాలిటీలో 39 వార్డులకుగాను 27 వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.