పని చేసే వారికే పార్టీ సభ్యత్వం
ABN , Publish Date - May 13 , 2026 | 04:25 AM
రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని గతంలో ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు రూటు మార్చింది.
కష్టకాలంలో జెండా మోసే కార్యకర్తలకే ప్రాధాన్యం
‘సర్’ మాదిరిగా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు
బూత్‌కు ఇద్దరు చొప్పున 71,310 మంది కార్యకర్తలకు శిక్షణ
2-3 రోజుల్లో మండలాల వారీగా సమన్వయ కమిటీలు
ముఖ్య నేతలతో సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్, గజ్వేల్/మర్కుక్, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని గతంలో ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు రూటు మార్చింది. ఇంతకు ముందులా సంఖ్య కోసమే కాకుండా.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసే వారికే సభ్యత్వాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలపై ఆధారపడకుండా.. సభ్యత్వ నమోదు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిష్పక్షపాతంగా అంచనా వేయడానికి, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా పార్టీని పటిష్ఠపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన ప్రక్రియను.. సభ్యత్వాల నమోదు నుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించేందుకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జీవన్‌రెడ్డి, పల్లారాజేశ్వర్‌రెడ్డి, బండప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలే అసలైన బలమని, వారికే క్రియాశీలక సభ్యత్వాలివ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సంఖ్యను చూపించటం కోసమే సభ్యత్వాలు కాకుండా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ డిజిటల్ విధానంలోనే జరుగుతున్నందున.. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలని సూచించారు. రాష్ట్రంలోని 36,655 పోలింగ్ బూత్‌లలో బూత్‌కు ఇద్దరు చొప్పున 71,310 మంది పార్టీ కార్యకర్తలకు డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై శిక్షణ ఇవ్వాలని, ఈ మేరకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి నియోజవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ నమో దు సమన్వయకర్తను నియమించామని, మండలం, మునిసిపల్ వారీ గా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా సాగేందుకు రెండు, మూడు రోజుల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
జిల్లాల వారీగా సమన్వయకర్తలు
దాదాపు 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సభ్యత్వ నమోదుకు జిల్లాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు టి. రవీందర్‌రావు; జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లికి జీవన్‌రెడ్డి; ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు సత్యవతిరాథోడ్; జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి; మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు గ్యాదరి బాలమల్లు; నిజామాబాద్, కామారెడ్డిలకు గంగాధర్‌గౌడ్; మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నారదాసు లక్ష్మణ్‌రావు; ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డి; వికారాబాద్, రంగారెడ్డిలకు సబితాఇంద్రారెడ్డి; మహబూబ్‌నగర్, నారాయణపేటలకు మహమూద్‌అలీ; గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తిలకు మెట్టు శ్రీనివాస్; మేడ్చల్, భువనగిరి జిల్లాలకు పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి; హైదరాబాద్‌కు తలసాని శ్రీనివా్‌సయాదవ్; నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు.