Share News

కాంగ్రెస్‌ తరఫున ప్రచారం కూడా చేశారు

ABN , Publish Date - May 07 , 2026 | 04:38 AM

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని, ఇది బహిరంగంగానే జరిగినా స్పీకర్‌ పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని బీఆర్‌ఎస్‌...

కాంగ్రెస్‌ తరఫున ప్రచారం కూడా చేశారు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బీఆర్‌ఎస్‌ వాదన

ఆ ఎమ్మెల్యేలకు కౌంటర్‌ దాఖలుకు మరో చాన్స్‌

విచారణను జూన్‌ 25కు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని, ఇది బహిరంగంగానే జరిగినా స్పీకర్‌ పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్‌, కాలే యాదయ్య, తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కడియం శ్రీహరి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని, వీరు పార్టీ మారలేదంటూ స్పీకర్‌ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్‌, కేపీ వివేకానంద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లు బుధవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది శ్రీపతి సంతోష్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం... పార్టీ మారారంటున్న ఎమ్మెల్యేలు కౌంటర్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు వాదిస్తూ తాము ఇటీవలే వకాల్తా దాఖలు చేశామని, కౌంటర్‌ దాఖలుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం.. విచారణను జూన్‌ 25కు వాయిదా వేసింది.

Updated Date - May 07 , 2026 | 04:38 AM