BRS MLAs Boycott: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:27 AM
కృష్ణా జలాలపై శాసన సభలో కీలకమైన చర్చ జరుగుతుండగా.. సభకు హాజరుకాకుండా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ..
స్పీకర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు అప్పీల్
కృష్ణా జలాలపై శాసన సభలో కీలకమైన చర్చ జరుగుతుండగా.. సభకు హాజరుకాకుండా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అప్పీల్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడం లేదంటే వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు.
ఆ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు!
తమకు మాట్లాడే అకాశం ఇవ్వట్లేదంటూ గత శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ సభ్యులు.. ఆ తర్వాత శని, సోమవారాల్లోనూ సభకు హాజరు కాలేదు. ఒక విధంగా శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. అయితే, బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను ఎదుర్కొన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, అరికెపూడి గాంధీ తదితర పది మంది ఎమ్మెల్యేలు మాత్రం సభకు యథాతథంగా హాజరవుతున్నారు. తమ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లలో 8 మందిపై విచారణ పూర్తి చేసిన స్పీకర్.. వారిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని, వారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని తీర్పు ఇచ్చారు. ఒకవైపు బీఆర్‌ఎస్ సభ్యులు సభను బాయ్‌కాట్ చేసినా.. వీరు మాత్రం యథావిధిగా హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే సభకు హాజరు కావద్దంటూ బీఆర్‌ఎ్‌సఎల్పీ ఎలాంటి విప్‌నూ జారీ చేయనందున.. వారికి ఇది సమస్య కాబోదని చెబుతున్నారు.