Share News

సీపీ తు..కోడు

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:34 AM

హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘సీపీ తుర్కోడు..

సీపీ తు..కోడు

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మతవిద్వేష వ్యాఖ్యలు

  • కరీంనగర్‌ సీపీపై రెచ్చిపోయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

  • వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద ఘటన

హుజూరాబాద్‌/హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘సీపీ తుర్కోడు.. తుర్క సీపీ చెబితే మీరు వింటారా?’ అంటూ పోలీసు సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తున్న కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగారు. ‘‘సీపీ తుర్కోడు.. తుర్క (ముస్లిం) సీపీ చెబితే వింటారా! ముస్లిం సీపీకి హిందూ సంప్రదాయ పండుగలు తెలుసా? హిందూ వ్యతిరేకి సీపీ’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూ.. అంటూ నేలకు ఉమ్మేస్తూ, ‘‘సిగ్గుండాలి.. వార్డు మెంబర్లు కానివారికి సీపీ, పోలీసులు గన్‌మెన్‌గా ఉంటారా! మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా. సీపీ, సీఐలు నాకు సెల్యూట్‌ కొట్టాల్సిందే’’ అంటూ కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీసు శాఖ కౌశిక్‌రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, సోషల్‌ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో శుక్రవారం ఆయన పోలీసులకు క్షమాపణ చెప్పారు. అంతకుముందు.. ఎమ్మెల్యేనైన తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.


పెద్దసంఖ్యలో వెళ్లవద్దన్నందుకు..!

వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పెద్దసంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి ఈ సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వర్గానికి విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయ్‌నందన్‌రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయ్‌నందన్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున.. అందరూ సంయమనం పాటించాలని ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతోపాటు వరంగల్‌-కరీంనగర్‌ జాతీయ రహదారిపై కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం కౌశిక్‌రెడ్డి వీణవంకకు వెళ్లాక.. జాతర ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ వివాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని సైదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా, పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల, ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు టౌన్‌ సీఐ కరుణాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 126 (2), 132, 196, 299 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది.

పోలీసులపై స్పీకర్‌కు ఫిర్యాదు..

తాను ఒక ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా.. తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్పీకర్‌ను కలిసి లేఖ సమర్పించారు. తాను సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా.. ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే పోలీసులు తనను, తన భార్యాపిల్లలను అకారణంగా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలోనూ తనను బలవంతంగా, అవమానకర రీతిలో అక్కడి నుంచి పంపించారని తెలిపారు. పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా, అసెంబ్లీ గౌరవానికి కూడా భంగం కలిగించేలా ఉందని, ప్రొటోకాల్‌ పాటించకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఈ మేరకు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్‌ సీఐ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.


పొరపాటైంది.. క్షమించండి..

కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలంను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్‌ అధికారుల సంఘం, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించాయి. ఐపీఎస్‌ అధికారి మతాన్ని ఉద్దేశిస్తూ కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలు చేసినందున ఆయన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐపీఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి విక్రమ్‌సింగ్‌ మాన్‌, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం కూడా కౌశిక్‌రెడ్డి తీరుపై మండిపడినట్లు సమాచారం. దీంతో పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో క్షమాపణ తెలిపారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా అన్నమాటలు కాదని, పోలీసులంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఒత్తిడిలో మాట జారానని తెలిపారు. తన మాటలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్బలంతోనే తనపై రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Jan 31 , 2026 | 04:34 AM