Share News

మాట తప్పడం రేవంత్‌ సంస్కృతి

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:11 AM

మాట తప్పడం, పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి అని.. తాను అలా కాదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్ర..

మాట తప్పడం రేవంత్‌ సంస్కృతి

  • భద్రాద్రి రాముడి సాక్షిగా చెప్పిన రుణమాఫీ ఏమైంది?

  • గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకపోవడం వైఫల్యమే

  • తెలంగాణకు అన్యాయం చేసి చంద్రబాబుకు జలకప్పం

  • సీఎం రేవంత్‌పై హరీశ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మాట తప్పడం, పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి అని.. తాను అలా కాదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రే అందుకు నిదర్శనమని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని రేవంత్‌ చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయలేని తన చేతగానితనాన్ని సీఎం అబద్ధాలతో కప్పిపుచ్చాలని చూడటం హీనమైన చర్య అని మండిపడ్డారు. 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని, ఇప్పుడు వస్తున్న లక్ష క్యూసెక్కుల వరదకు ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా వినియోగించుకుందని తెలిపారు. పట్టిసీమలో మొత్తం 24 మోటార్లను ఫుల్‌ రన్‌లో ఉంచి గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు నష్టంచేసి.. తన గురువు చంద్రబాబుకు జలకప్పం కడుతున్నట్లుగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాహుబలి పంపులు సిద్ధంగా ఉన్నా.. ఆన్‌ చేయకపోవడం చంద్రబాబుతో చీకటి ఒప్పందంలో భాగమేనని విమర్శించారు. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్‌ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్‌ చేస్తున్న నమ్మక ద్రోహమని మండిపడ్డారు. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుందని హరీశ్‌రావు నిలదీశారు. రైతుల కడుపు కొట్టే రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు.


తెలంగాణను కరువు కోరల్లోకి నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో తెలంగాణ రైతుల భవిష్యత్తును బలిచేయడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తాగు, సాగునీటి గోసకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్‌ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 11 , 2026 | 06:12 AM