బీఆర్‌ఎస్ హయాంలోనే దోపిడీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:28 AM
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన దోపిడీని ప్రజల ముందు పెట్టేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. గత పదేళ్లలో ధరణి, మైనింగ్ పేరుతో జరిగిన అక్రమాలు, వాటి వెనక ఉన్న వ్యక్తుల ప్రమేయాన్ని .....
ఆ పదేళ్లలో ధరణి, మైనింగ్‌లో రూ.వందల కోట్ల అక్రమాలు
బీఆర్‌ఎస్ హయాంలోనే బుద్వేల్‌లో 100 ఎకరాల వేలం
నాటి అక్రమాలను ప్రజల ముందుపెడతానని సన్నిహితుల వద్ద ప్రస్తావించిన పొంగులేటి
మౌనం బలహీనత కాదన్న మంత్రి
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్ర జ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన దోపిడీని ప్రజల ముందు పెట్టేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు. గత పదేళ్లలో ధరణి, మైనింగ్ పేరుతో జరిగిన అక్రమాలు, వాటి వెనక ఉన్న వ్యక్తుల ప్రమేయాన్ని ఆధారాలతో సహా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. మౌనం బలహీనత కాదని, పస లేని ఆరోపణలతో బీఆర్‌ఎస్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పినట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్దిపేటలో భూములను కొల్లగొట్టిన బీఆర్‌ఎస్ పెద్దల బండారం బయటపడుతుందనే కొత్వాల్‌గూడ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అంశాన్ని తెరమీదకు తెచ్చిన తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్ద మంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ హయాంలోనే 2022-23లో బుద్వేల్‌లో 100 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ వేలం వేసిందని, ఆ వంద ఎకరాలను లేఅవుట్ చేసేందుకు ఎన్‌సీసీ కంపెనీకి హెచ్‌ఎండీఏ పనులు అప్పగించిందని తెలిపారు. ఎన్‌సీసీ కంపెనీ లేఅవుట్ వేసే సమయంలో పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించి కొత్వాల్‌గూడలో డంప్ చేసిందని, వృథాగా పడి ఉన్న వాటిని హెచ్‌ఎండీఏ ద్వారా క్రషింగ్ చేసేందుకు తిరుమల మెటల్ ఇండస్ట్రీ అనుమతి పొందినట్లు పొంగులేటి ప్రస్తావించారని తెలిసింది. ఆ సంస్థ క్రషింగ్ చేసిన మెటీరియల్‌ను రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ రోడ్డు పనులకు వినియోగించేదని, ఇందుకోసం రాయల్టీ కింద ప్రభుత్వానికి రూ.2 కోట్లపైగా చెల్లింపులు కూడా జరిగాయని పేర్కొన్నట్లు తెలిసింది. రాయల్టీ కింద 2025 డిసెంబరు 18న రూ.1.52 కోట్లు, మరోసారి రూ.1.22 కోట్లు గనుల శాఖకు చెల్లించినట్లు రాఘవ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన వివరాలను కూడా పొంగులేటి కాంగ్రెస్ సభ్యులకు వివరించారని, ఈ విషయంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్తు బిల్లులు, ఇతర అనుమతులు తిరుమల క్రషర్స్ పేరుతో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.
తనను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణల మీద ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో జరిగిన మైనింగ్ అక్రమాలు, వాటి వెనక ఉన్న పెద్దల బాగోతం వెలుగులోకి రానున్నాయని, పదేళ్ల కాలంలో జరిగిన అవకతవకలు, పాపాలను ప్రజలకు వివరిస్తామని పొంగులేటి కాంగ్రెస్ నేతల వద్ద ప్రస్తావించారని తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వందల ఎకరాలు లీజుకు పొంది అక్రమాలకు పాల్పడిన గత పాలకుల వివరాలను ప్రజల ముందుంచుతానని మంత్రి సన్నిహిత ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారని సమాచారం. అలాగే, హరీశ్‌రావు తీరును మంత్రి విమర్శించారు. ‘హరీశ్‌రావు నిన్న అసెంబ్లీలో న్యాయ విచారణ కావాలని అడిగారు. ఈరోజు ఉదయం హౌస్ కమిటీ కావాలని డిమాడ్ చేశారు. సాయంత్రానికి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరోసారి ప్లేట్ మార్చారు. అంటే ఈ అంశంపై ఆయనకు విచారణ జరగడం ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ అంశంపైనా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి కోర్టులు ముందుకు రావడం లేదు. ఈ విషయం హరీశ్‌కు బాగా తెలుస’ని అన్నారు.
కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం ఖాయం
వచ్చే నెల 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అడూర్‌లో యూడీఎఫ్ అభ్యర్థి శాంతకుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా పొంగులేటి ఏప్రిల్ 6 వరకు కేరళలో పర్యటించనున్నారు.