Share News

BRS leaders: అసెంబ్లీలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి

ABN , Publish Date - Jan 04 , 2026 | 05:14 AM

కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ వేదికగా రాజకీయ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు....

BRS leaders: అసెంబ్లీలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి

  • సభలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్లపై స్పీకర్‌కు లేఖ రాసిన సంగతిని ఉత్తమ్‌ మరిచారా ?

  • బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు

  • ఆటో డ్రైవర్ల అరెస్టులు దుర్మార్గం : కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ వేదికగా రాజకీయ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంప్రదాయాలు, విలువలంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు, అధికారం రాగానే వాటిని తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం ఆయన ఓ పోస్టు చేశారు. అసెంబ్లీలో ఆడియో, విజువల్‌ ప్రజంటేషన్‌ నిర్వహణ భారత పార్లమెంట్‌ సంప్రదాయాలకు విరుద్ధమని, అందుకే సభకు హాజరుకాబోమని 2016లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాటి స్పీకర్‌కు లేఖ రాసిన విషయాన్ని హరీశ్‌ గుర్తు చేశారు. ఆ లేఖలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పద్మావతి కూడా సంతకాలు చేశారని వెల్లడించారు. నాడు స్పీకర్‌కు లేఖ రాసిన ఉత్తమ్‌ నేడు మంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రజంటేషన్‌కు సిద్ధమవ్వడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. నాడు ఉత్తమ్‌ రాసిన లేఖ ఫొటోను కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో సభా సంప్రదాయాలు, మర్యాదలకు భంగం కలిగిస్తున్నారని, రాజ్యాంగానికే తూట్లు పొడుస్తూ.. అదే తాము తీసుకొస్తున్న మార్పుగా భావిస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు. కాగా, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆటోడ్రైవర్ల జేఏసీ నేతలు, వేలాది మంది ఆటో డ్రైవర్ల అరెస్టులను బీఆర్‌ఎస్‌ పార్టీ ఖండిస్తోందని శనివారం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకరోజు ముందే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఆగాలంటే వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన ఆటో డ్రైవర్లను భేషరతుగా విడుదల చేయాలని కోరారు.

Updated Date - Jan 04 , 2026 | 05:14 AM