బీఆర్‌ఎస్ నేతలు ట్యాపింగ్ ఆపలేదు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:48 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతూనే ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
పాత అలవాటును వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు
విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ట్యాపింగ్
అవి ఏ ఫాంహౌస్‌లలో ఉన్నా గుర్తిస్తాం.. వారిని శిక్షిస్తాం
ఓటు వేయమని ఉద్యోగులను అడిగితే తప్పేంటి?
పురపాలికల్లోనూ ప్రజలు కాంగ్రె్‌సకే పట్టం కడతారు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతూనే ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు వాడుతున్న పరికరాలు ఏ తోటల్లో, ఫాంహౌ్‌సల్లో ఉన్నా గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, తాతా మధుసూదన్, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు తనపై చేసిన ఆరోపణల మీద మంత్రి పొంగులేటి ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ టెలీకాన్ఫరెన్సులు పెట్టారని, తాము దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొనడాన్ని ఖండించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల సమాచారాన్ని తెలుసుకున్న అలవాటును ఇంకా వదిలిపెట్టలేదన్నారు. విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ఇంకా వినియోగిస్తున్నారని, వాటితో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎక్కడ అమర్చినా పట్టుకొని తీరతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగులు కూడా ఓటర్లేనని, ప్రభుత్వం వారిని ఓటు అడగడం సహజమని చెప్పారు. తన నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో ఉద్యోగుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయని, వారిని ఓటు వేయాలని కోరితే.. దాన్ని కూడా బీఆర్‌ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఉద్యోగులతో మాట్లాడిన విషయాలు ఎలా బయటకు వచ్చాయనేదానిపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఉద్యోగులతో మాట్లాడిన మాటలను ఎలా విన్నారనేదానిపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను బెదిరించి ఎన్నికల్లో వినియోగించుకున్నారని.. తాము అలా చేయలేదని, ప్రజాస్వామ్యబద్ధంగానే ఓటు అడిగామని చెప్పారు. రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికల్లో 80 శాతం పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారన్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పురపాలికల్లోనూ ఓటర్లు కాంగ్రె్‌సకు పట్టం కడతారని తెలిపారు. బుధవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సీపీఐ స్నేహపూర్వక పోటీ మాత్రమే చేసిందని తెలిపారు.