కమిషనర్‌కు ఐజీ సెలవు ఇవ్వడమేంటి?
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:46 AM
కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలంపై బీఆర్‌ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
కరీంనగర్ సీపీపై చర్యలు తీసుకోవాలి: కౌశిక్‌రెడ్డి
నిజానిజాలు తేలుస్తాం : దుద్దిళ్ల
హైదరాబాద్, కరీంనగర్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలంపై బీఆర్‌ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై విచారణ జరిపి నిజానిజాలు తేలుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. కరీంనగర్ సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కరీంనగర్ జిల్లా బోనాలపల్లె వద్ద ఉన్న పోలీసు ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్‌లో సీపీ భార్య గతేడాది సెప్టెంబరు 22న ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారని, అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ గాయమైందని మార్చి1న కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో, మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడారు. తాను ఆరోపణలు చేసిన తర్వాత సెలవులో ఉన్నానని పేర్కొంటూ కరీంనగర్ సీపీ ఓ ప్రకటన విడుదల చేశారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, పోలీసు విభాగంలో కమిషనర్‌కు సెలవు మంజూరు చేసేది డీజీపీ అని, కానీ కరీంనగర్ సీపీకి ఐజీ సెలవు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీపై మార్చి 30వ తేదీలోగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరిన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు. మరోపక్క, కరీంనగర్ పోలీసులపై కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రకటించారు. నిజానిజాలు తెలుసుకోవాలంటే పూర్తిస్థాయి విచారణ జరపాలని తెలిపారు.