Share News

ఆ హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

ABN , Publish Date - May 20 , 2026 | 03:39 AM

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పాదయాత్ర చేసే నైతిక హక్కు మహబూబ్‌నగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఆ హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

  • పాలమూరుకు కేసీఆర్‌ తగిన నిధులివ్వలేదు

  • పాదయాత్ర చేసే నైతికహక్కు వారికి లేదు

  • ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు : జూపల్లి

  • ప్రజలు బీఆర్‌ఎ్‌సను నమ్మరు: వాకిటి

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పాదయాత్ర చేసే నైతిక హక్కు మహబూబ్‌నగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నవాళ్లు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి తదితరులతో కలిసి మంత్రి జూపల్లి మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పంపులు, మోటార్లు, సర్జ్‌పూల్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించి.. కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ వంటి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ హయాంలో రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.6300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ స్థాయి రిజర్వాయర్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పాలమూరు జిల్లాకు అత్యధికంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి లో మోటార్‌ ఆన్‌ చేయగానే నీళ్లు వస్తాయంటూ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలివి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరుతో పాటు అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌ తమకు హామీ ఇచ్చారని, లక్ష్మీదేవిపల్లి గుట్టకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పారని వెల్లడించారు. చంపినోడే సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఏడ్చినట్లు బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహారం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పాలమూరు - రంగారెడ్డి తర్వాత మొదలైన కాళేశ్వరానికే కేసీఆర్‌ నిధులు కేటాయించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు పొర్లు దండాలు పెట్టినా పాలమూరు ప్రజలు నమ్మబోరని అన్నారు. యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులను కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌‌కు పిలిచి.. ఏం చేస్తున్నారంటూ తిట్టారని, దాంతో జిల్లాలో ఆ పార్టీ ఉనికి ఉందని చెప్పడం కోసమే పాలమూరు--రంగారెడ్డిపై మాట్లాడుతున్నారని తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 03:39 AM