బీఆర్‌ఎస్ శకం ముగిసింది
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:22 AM
తెలంగాణలో బీఆర్‌ఎస్ శకం ముగిసిందని, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు అనేది లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
ఆ పార్టీకి భవిష్యత్తే లేదు..
సీఎం రేవంత్ రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. కేటీఆర్ పట్టుమని పాతిక వేల కోట్లు తేలేదు: మహేశ్ గౌడ్
హైదరాబాద్/పంజాగుట్ట/బర్కత్‌పుర, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ శకం ముగిసిందని, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు అనేది లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కోన్ కిస్కా కేటీఆర్, హరీశ్‌రావులతో మనకు పని లేదన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ముఖానికి ఏనాడైనా విదేశాల నుంచి పట్టుమని పాతిక వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాడా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్లి రూ.1.75 లక్షల కోట్లు, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ నాయకత్వంలో ఎస్టీ, ఎస్సీల మద్దతుతో వంద సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లంబాడాలు, ఎరుకల, యానాది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి తలపెట్టిన లంబాడా ప్రజాప్రతినిధుల బస్సు యాత్రను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. లంబాడా, ఎరుకల, యానాది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. కాగా, సర్ ప్రక్రియను సీరియ్‌సగా తీసుకోవాలంటూ సీఎం రేవంత్ ఆదేశాల నేపథ్యంలో టీపీసీసీ అప్రమత్తమైంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్లమెంటు ఇన్‌చార్జులు, బూత్ లెవల్ సూపర్ వైజర్లను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ సమన్వయం చేసుకోవడానికి నియోజకవర్గానికి ఒక నేతను సమన్వయకర్తగా నియమించింది. కాగా, ఆర్‌ఎ్‌సఎస్ మూలాలున్న వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నీట్ పరీక్ష పేపర్ లీక్ చేశారని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 28 రాష్ట్రాల్లో ఈ నెల 30 నుంచి 40 రోజుల పాటు కాంగ్రెస్ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ విక్రాంత్ భూరియా, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్‌లతో కలిసి మహేశ్‌గౌడ్.. ఛాత్రోన్ కీ గూంజ్ మిస్డ్ కాల్ నంబర్, సభ్యత్వ రిజిస్ట్రేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.