TPCC Chief Mahesh Goud: బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:33 AM
బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలకు...
ఆ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు
బీజేపీ ప్రభావం చూపే స్థితిలో లేదు
కవితను పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి సమాధానమూ లేదన్నారు. ఫలితంగా బీఆర్‌ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రజలు నమ్ముతున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ.. రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితిలో లేదన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మహేశ్‌గౌడ్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆమెను పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదన్నారు. బీజేపీ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. తామూ హిందూ మతానికి చెందిన వారిమేనని, తాము కొలిచేదీ హిందూ దేవుళ్లనేనని చెప్పారు. దేవుళ్లను దేవళ్లలాగే చూడాలే కానీ.. వారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో 90 శాతానికి పైగా హిందూ మతానికి చెందిన వారేనన్నారు. 18న మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో మొదటిసారిగా హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం జరగనుండటం శుభ పరిణామమన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు.
కాగా బీఆర్‌ఎస్ అనుకూల మీడియా.. డబ్బుల కోసం తాను భ్రమరాంబ అనే కంపెనీని బెదిరించినట్లుగా దుష్ప్రచారం చేస్తోందంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ధ్వజమెత్తారు. వాస్తవానికి ఆ కంపెనీ సబ్ కంట్రాక్టర్ బాషా తనను కలిసి ఆ కంపెనీ నుంచి రావాల్సిన రూ. 8 లక్షలు ఇప్పించాలని కోరారని, దాంతో భ్రమరాంబ కంపెనీ జీఎంకు ఫోన్ చేసి భాషాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలంటూ చెప్పానని వివరణ ఇచ్చారు. బాషాకు డబ్బులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భ్రమరాంబ కంపెనీ పని చేయించుకోవడంతో ఆ గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరిందన్నారు. సబ్‌కంట్రాక్టర్ బాషాకు ఇవ్వాల్సిన రూ.8లక్షలు కాస్తా రూ.8కోట్లు చేసి కేటీఆర్ యూ ట్యూబ్ చానల్స్‌లో తనపై దుష్ప్రచారం చేశారని వివరించారు.కాగా గిగ్ వర్కర్లపైన అమలు చేస్తున్న ‘‘పది నిమిషాల డెలివరీ’’ వంటి నిబంధనల తొలగింపు నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కార్మిక విభాగం ఇన్‌చార్జి సంగిశెట్టి జగదీశ్వర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేసిన పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు.