Share News

వైసీపీ బాటలో బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:49 AM

మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తూ.. మీడియా ప్రతినిధులను తమ పార్టీ కార్యాలయాల్లోకి, కార్యకలాపాలకు రానివ్వని వైసీపీ బాటలోనే రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ కూడా పయనిస్తోంది.

వైసీపీ బాటలో బీఆర్‌ఎస్‌

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చర్చల్లో పాల్గొనం

  • పార్టీ కార్యకలాపాలకు ప్రతినిధులను రానివ్వం

  • బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌

  • టీవీ చర్చలో పిచ్చి నా.. అంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి అసభ్య వ్యాఖ్యలు

  • గెటవుట్‌ అన్న ఏబీఎన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తూ.. మీడియా ప్రతినిధులను తమ పార్టీ కార్యాలయాల్లోకి, కార్యకలాపాలకు రానివ్వని వైసీపీ బాటలోనే రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ కూడా పయనిస్తోంది. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను తమ పార్టీ కార్యాలయాలకు, కార్యకలాపాలకు రానివ్వబోమని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రకటించింది. అధికారంలో ఉన్నప్పుడూ లేనప్పుడూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కూడా ఆ పార్టీనే అనుసరిస్తోంది. ఇకపై ఏబీఎన్‌లో జరిగే ఎలాంటి చర్చల్లోనూ బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొనరని ప్రకటించింది. తెలంగాణ భవన్‌తోపాటు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానల్‌ ప్రతినిధులకు అనుమతి ఉండదని పేర్కొంది. పార్టీ కార్యక్రమాలకు ఆ చానల్‌ ప్రతినిధులను అనుమతించకూడదని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 23న ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ చానల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు. చర్చ సందర్భంగా.. ఆయన లైవ్‌లో ‘పిచ్చి నా..’ అంటూ అసభ్యకరమైన పద ప్రయోగం చేశారు. వెంటనే, దానిని ఉపసంహరించుకోవాలని ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వెంకటకృష్ణ పదే పదే కోరారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోనని రవీందర్‌ రావు తెగేసి చెప్పారు. ఆ సమయంలో, గెటవుట్‌ ఫ్రం మై డిబేట్‌ అని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే, చర్చకు ఆహ్వానించిన అతిథిని గెటవుట్‌ అనడం అనుచితమే కావచ్చు. కానీ, ఒక అసభ్య పదాన్ని వాడి.. పదే పదే కోరినా దాన్ని వెనక్కి తీసుకోవడానికి రవీందర్‌ రావు నిరాకరించిన పరిస్థితుల్లోనే ఇలా జరిగిందని గమనించాలి.

Updated Date - Jan 26 , 2026 | 03:49 AM