Share News

బీఆర్‌ఎస్‌ బీసీ ద్రోహుల పక్షమా?

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:37 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీల పక్షమా లేక బీసీ ద్రోహుల పక్షమా? అనేది తేల్చాలని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ బీసీ ద్రోహుల పక్షమా?

  • మాధవరెడ్డిని 48 గంటల్లో సస్పెండ్‌ చేయాలి

  • లేదంటే పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

  • బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జాజుల బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీల పక్షమా లేక బీసీ ద్రోహుల పక్షమా? అనేది తేల్చాలని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జాజుల శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. బీసీల విషయంలో బీఆర్‌ఎస్‌ ముసుగు తొలగిందన్నారు. ‘‘తెలంగాణలో 60 శాతం పైగా ఉన్న బీసీలు తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్న విషయం మీకు తెలియంది కాదు. కామారెడ్డి డిక్లరేషన్‌ పేరుతో తాము అధికారంలోకి వస్తే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42ు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. దానికి బీఆర్‌ఎస్‌ మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. 42ు బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో 9 విడుదల చేసింది. దాన్ని సవాలు చేస్తూ రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి కోర్టులో కేసులు వేశారు. పెంచిన రిజర్వేషన్లను కోర్టు ద్వారా కొట్టివేయించారు. బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూసిన ద్రోహి మాధవరెడ్డి. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు ముడిచింతలపల్లి మునిసిపాలిటీ నుంచి కేశవపూర్‌ పదో వార్డు కౌన్సిలర్‌గా బీఆర్‌ఎస్‌ బీఫాం ఇచ్చి బరిలో నిలిపారు. మాధవరెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. మీకు తెలియకుండా మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకోరని బలంగా నమ్ముతున్నాం. నిజంగా బీఆర్‌ఎ్‌సకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మాధవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. మీ నిర్ణయం 48 గంటల్లో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం. లేదంటే 3 కోట్ల మంది బీసీల పక్షాన ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో జాజుల పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:37 AM