Share News

సుందరీకరణ పేరిట దోపిడీ

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:54 AM

మూసీ సుందరీకరణ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీకి తెరలేపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

సుందరీకరణ పేరిట దోపిడీ

  • రూ.16 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఎందుకు?

  • మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్‌దే : కేటీఆర్‌

  • పవర్‌ పాయింట్‌ వర్సెస్‌ పబ్లిక్‌ పాయింట్‌ పేరుతో సమావేశం

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీకి తెరలేపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం రూ.16,634 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఎందుకని ప్రశ్నించారు. వాస్తవానికి మూసీనదిని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్‌ పార్టీదేనని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌ పాపాన్ని కడగడానికి కేసీఆర్‌ హయాంలో తాము మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఇందుకోసం ఒక్క ఇల్లు కూడా పోకుండా ఉండేలా అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌ కంపెనీల ద్వారా పది డిజైన్లు తీసుకుని.. ఒక దానిని ఎంపిక చేసి ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం వేల మంది ఇళ్లు కూలగొట్టి, వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారని ధ్వజమెత్తారరు. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రయతాన్ని ప్రతి దశలోనూ అడ్డుకుంటామని ప్రకటించారు. శనివారం సాయంత్రం హిమాయత్‌సాగర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘పవర్‌ పాయింట్‌ వర్సెస్‌ పబ్లిక్‌ పాయింట్‌’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. మూసీ సుందరీకరణ తొలి దశలో ఉప్పల్‌ భగాయత్‌ నుంచి నాగోల్‌ వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల తీరు, మారిన అక్కడి స్వరూపాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పర్యావరణ అనుమతులు లేకుండా, డీపీఆర్‌ తయారు చేయకుండా, పునరావాస, నష్టపరిహార విధానాలు ఖరారు చేయకుండా బాఽధితుల ఇళ్లపై రెడ్‌మార్‌ ్కలు వేసి.. వారి గుండెల్లో గునపాలు దింపారని కేటీఆర్‌ ఆరోపించారు.


బఫర్‌జోన్‌లో ఇళ్లు, స్థలాలు ఉన్నవారికి జీరో వాల్యూ ఉంటుందంటున్న ముఖ్యమంత్రి.. ఆయా ఆస్తులను నిషేధిత జాబితాలోకి ఎందుకు ఎక్కించారని ప్రశ్నించారు. మూసీకి అటు ఇటు 500 మీటర్ల బఫర్‌ జోన్‌ పేరిట పేదలు, మధ్య తరగతి వారి ఇళ్లను కూల్చడానికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. చెరువులో ఇళ్లు కట్టిన మంత్రి పొంగులేటి, మహేందర్‌రెడ్డి, వివేక్‌ తదితరుల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కోస్గిలో ముఖ్యమంత్రి ఇల్లు చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందని, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఎఫ్‌టీఎల్‌ ఉందని, దానిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు హమీలు నెరవేర్చడానికి డబ్బులేదు గానీ, లక్షల కోట్లు ఎక్కడి నుంచి సీఎం తీసుకుని వస్తారని ప్రశ్నించారు. నమామి గంగా ప్రాజెక్టు 2వేల కిలోమీటర్లకు రూ.42 వేల కోట్లు ఖర్చయితే.. 55 కిలోమీటర్ల దూరానికి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు అవుతాయన్న విషయం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 05:55 AM