Share News

ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్‌ ద్రోహం: వాకిటి

ABN , Publish Date - May 25 , 2026 | 05:12 AM

ప్రాజెక్టుల నిర్మాణం పేరిట గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు.

ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్‌ ద్రోహం: వాకిటి

షాద్‌నగర్‌/న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల నిర్మాణం పేరిట గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లు మంజూరు చేసి రూ.28 వేల కోట్లు మాత్ర మే వెచ్చించిందని తెలిపారు. పైగా అరకొర పనులు చేసి 90ు పూర్తిచేశామని బీఆర్‌ఎస్‌ నేతలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల అంశంలో బీఆర్‌ఎస్‌ పాలకులు ప్రజలకు ద్రోహం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలను నమ్మించి మోసం చేస్తే.. తమ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు తాగు, సాగు నీరందించేందుకు కుర్చీవేసుకుని లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్‌ కడతామని చెప్పిన కేసీఆర్‌.. భూ సేకరణైనా చేపట్టలేదన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీ రాజాజీమార్గ్‌లోని నివాసంలో ఖర్గేను శ్రీహరి కలిశారు. ఆదివారం మధ్యాహ్నమే మంత్రి హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాలకు పైగా ఖర్గేతో భేటీ జరిగింది. అయితే, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఖర్గేతో శ్రీహరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గే ఆరా తీసినట్లు తెలిసింది.

Updated Date - May 25 , 2026 | 05:12 AM