బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:35 AM
ఓట్ల లెక్కింపులో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓ అభ్యర్థిని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణ
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపులో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓ అభ్యర్థిని ఆత్మహత్యాయత్నం చేశారు. తన ఓటమికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ సమయంలో తనకు చెందిన వంద బ్యాలెట్ పేపర్లను అక్కడి సిబ్బంది ప్యాంట్ జేబులో దాచుకోవడాన్ని గుర్తించానని కొత్తగూడెం కార్పొరేషన్‌లోని 54వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని మాదాసు పద్మ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బందికి ఫోన్ రాగా బయటకు వెళ్లి బ్యాలెట్ కట్టను దాచారని పేర్కొన్నారు. పలుమార్లు సిబ్బంది వద్ద ఉన్న బ్యాలెట్ కట్టలను లెక్కింపు డబ్బాలలో వేయాలని కోరినా.. వినకుండా దురుసుగా మాట్లాడారని తెలిపారు. బలవంతంగా తనతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. దీనిపై అక్కడి రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా.. స్వీకరించలేదన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను కొత్తగూడెం గణేశ్ టెంపుల్ ఏరియాలోని తన స్వగృహంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, నిమిషాల్లోనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న పద్మను కాపాడారు. జరిగిన ఘటనపై ఆమె శనివారం భద్రాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. కలెక్టర్ అందుబాటులో లేరు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని పద్మ తెలిపారు.