ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి బీజేపీ యత్నం
ABN , Publish Date - May 08 , 2026 | 05:47 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారని, అందుకే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోతున్నాయనే అనుమానాలున్నాయని..
తంబాకులో డ్రగ్స్ కలిపి వాడడం వల్లే బండి తలపై జుట్టు ఊడిపోతోందన్న ఆయనవ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు
కౌశిక్‌రెడ్డిని గదిలోకి పంపి తలుపులు మూసిన గన్‌మెన్
ఆయన కారు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన కాషాయ శ్రేణులు
బీజేపీ కార్యాలయంపైకి దూసుకెళ్లినబీఆర్‌ఎస్ నాయకులు
లాఠీచార్జ్ చేసిన పోలీసులు.. ఇరు పార్టీల కార్యకర్తల అరెస్ట్
కౌశిక్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించిన కేటీఆర్
వ్యక్తిగత దూషణలు చేస్తే తిప్పికొడతాం: రాంచందర్‌రావు
కరీంనగర్ టౌన్/కరీంనగర్ క్రైం, హుజూరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారని, అందుకే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోతున్నాయనే అనుమానాలున్నాయని.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భగ్గుమన్న బీజేపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాడి.. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బండి సంజయ్ వ్యక్తిగత దూషణలు చేయడం శోచనీయమన్నారు. కేటీఆర్‌కు డ్రగ్స్ పరీక్ష చేయాలని అంటున్నారని.. సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కూడా డ్రగ్స్ పరీక్షలకు వస్తే కేటీఆర్ కూడా పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలకూ డ్రగ్స్ పరీక్షలు చేయాలని తాము కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. తన కదలికలపై కూడా రెక్కీ నిర్వహిస్తున్నారని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని పేర్కొన్నారు. కాగా.. బండి సంజయ్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్‌మెన్ కౌశిక్‌రెడ్డిని, ఇతర నాయకులను గదిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసేశారు. బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌశిక్‌రెడ్డి కారుపై కర్రలతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు.
క్యాంపు కార్యాలయం కిటికీలు, పూలకుండీలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ సాధ్యం కాకపోవటంతో స్వల్పంగా లాఠీచార్జి చేశారు. బీజేపీ కార్పొరేటర్‌ను, కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి సీటీసీకి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ బీజేపీ కార్యాలయం వైపు దూసుకుపోవటానికి ప్రయత్నించగా వారిని కూడా అరెస్టు చేశారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో ఒక బీఆర్‌ఎస్ కార్యకర్త గాయపడ్డాడు. గులాబీ శ్రేణులు బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంజయ్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అనంతరం పోలీసులు కౌశిక్‌రెడ్డికి వాహనం సమకూర్చి, హుజూరాబాద్‌కు పంపించారు. ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయం, మంత్రి క్యాంప్ ఆఫీస్, డీసీసీ కార్యాలయాల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక, కౌశిక్ రెడ్డిపై బీజేపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు పార్టీల శ్రేణులూ పరస్పరం కర్రలు, రాళ్లు విసురుకున్నాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖండించిన కేటీఆర్.. హెచ్చరించిన రాంచందర్‌రావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలపై బండి సంజయ్ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పట్టపగలు గూండాల మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయాల్లోకి ప్రవేశించి ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గ చర్య అని గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు. కళ్ళముందే వారు ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బ తీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. అయితే.. తమ పార్టీ నాయకులపై ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హెచ్చరించారు. అసత్య ఆరోపణలను, వ్యక్తిగత దూషణలను తమ పార్టీ తగినవిధంగా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. బండి సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘సంజయ్‌కి తంబాకు, డ్రగ్స్ అలవాటు లేదని నిరూపించేందుకు మేం సిద్ధం.. దేవుడి సాక్షిగా కుటుంబసభ్యులతో వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధం..మరి డ్రగ్స్ తీసుకోలేదని దేవుడి గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేసే దమ్ము కేటీఆర్‌కు ఉందా?’ అని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ సవాల్ చేశారు.