ఏబీఎన్‌ను నిషేధించడం పెద్ద జోక్
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:41 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్‌ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎన్నడో నిషేధించారని చెప్పారు.
బీఆర్‌ఎ్‌సను ప్రజలు ఎన్నడో నిషేధించారు: బండి సంజయ్
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్‌ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎన్నడో నిషేధించారని చెప్పారు. బీఆర్‌ఎస్ అడుగులకు మడుగులొత్తే టీ న్యూస్ మాదిరిగానే ఇతర ఛానళ్లు కూడా ఉండాలనుకోవడం ఆ పార్టీ మూర్ఖత్వమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు టీ న్యూస్‌లో మాట్లాడినట్లుగానే ఇతర ఛానళ్లలోనూ మాట్లాడతానంటే ఎలా అని ప్రశ్నించారు. ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హద్దు దాటింది ఎవరు? దాన్ని సరిదిద్దాలనుకున్నది ఎవరు?బీఆర్‌ఎస్ నేత దూషణలకు పాల్పడడం తప్పు కాదా..? ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీఎన్ కోరినా వినకుండా మూర్ఖంగా వ్యవహరించడం హుందాతనం అవుతుందా? ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడటం బీఆర్‌ఎస్ నేతల వంతే.. ఛానల్‌ను బహిష్కరించడం కూడా వాళ్ల వంతేనా?వారు ఏం చేసినా తలూపడానికి తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లనుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా.. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటూ ఇవ్వకుండా చెంప చెళ్లుమనేలా తీర్పును ఇచ్చినా సిగ్గు రాలేదా? పదేళ్ల పాలనలో చేసిన తప్పులు, అవినీతిని ఒప్పుకోకుండా మీడియా సమావేశాలు, టీవీ చర్చా కార్యక్రమాల్లో శ్రుతి మించి.. కండకావరంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? బీఆర్‌ఎస్ నేత ఉపయోగించిన పదాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఏబీఎన్ ప్రతినిధి పదే పదే కోరినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడినందుకు గెట్ ఔట్ అన్నారు.. అందులో తప్పేముంది? వ్యక్తిత్వమే లేని బీఆర్‌ఎస్ నేతలు.. వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. అవినీతి, అక్రమాలు చేయడంలోనే కాదు.. బూతులు తిడుతూ మీడియాను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఆరితేరారు’’ అని సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.