Share News

Gongidi Sunitha: పార్టీ నీకేం తక్కువ చేసింది?

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:49 AM

బీఆర్‌ఎ్‌సలో ప్రజాస్వామ్యం లేదంటే నీకు పదవులెలా దక్కాయి..? పార్టీ నీకేం తక్కువ చేసింది..?’’ అంటూ బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు..

Gongidi Sunitha: పార్టీ నీకేం తక్కువ చేసింది?

  • ఎంపీగా ఓడితే.. ఎమ్మెల్సీ ఇవ్వలేదా

  • లిక్కర్‌ కేసుతో కేసీఆర్‌కూ దెబ్బ

  • నీ ఆస్తుల ముందు కేసీఆర్‌ ఆస్తులు ఎంత..?

  • కవితపై బీఆర్‌ఎస్‌ మహిళా నేతల ధ్వజం

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎ్‌సలో ప్రజాస్వామ్యం లేదంటే నీకు పదవులెలా దక్కాయి..? పార్టీ నీకేం తక్కువ చేసింది..?’’ అంటూ బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. గొంగిడి సునీత, తుల ఉమ, సుమిత్రానంద్‌ తదితరులు సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘నిజామాబాద్‌లో ఎంపీగా ఓడిపోయానని కంట తడి పెట్టుకుంటే.. కేసీఆర్‌ నిన్ను ఓదార్చి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టలేదా..? నాలుగు నెలల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే.. ఇంకా పదవిలోనే ఎందుకు కొనసాగుతున్నావు. బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే శాసన మండలికి ఎందుకు వెళ్లావు. అక్కడ బీఆర్‌ఎ్‌సను, పార్టీ నేతలను ఎందుకు విమర్శించాల్సి వచ్చిందో చెప్పు. ఏడిస్తే నిన్ను ఓదార్చేవారెవరున్నారు. నీ లిక్కర్‌ స్కాం కేసుతో కేజ్రీవాల్‌కే కాదు.. కేసీఆర్‌కూ దెబ్బ తగిలింది. పార్టీ అన్ని సమయాల్లో నీకు అండగా ఉంది. నువ్వు జైల్లో ఉన్నప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిరంతరం నీ కోసమే ఆలోచించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు నిన్ను బయటకు తెచ్చేందుకు ఢిల్లీలోనే మకాం వేశారు. అలాంటి వాళ్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారంటున్నావ్‌.. మరి శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆయన మాత్రం నీకు ఉద్యమకారుడిలా కనబడుతున్నారా..? టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చినపుడు కవితకు చెప్పలేదనడం అవాస్తవం. బీఆర్‌ఎస్‌ పార్టీ మార్పు తర్వాత కేసీఆర్‌ నిన్ను ఇతర రాష్ట్రాలకు వెంటబెట్టుకొని వెళ్లారు కదా..? తెలంగాణ జాగృతిని నువ్వు భారత జాగృతిగా ప్రకటించింది మరచిపోయావా..? ఆస్తుల పంచాయతీకాదు.. అధికార పంచాయతీ అంటున్నావ్‌.. నీ ఆస్తుల ముందు కేసీఆర్‌ ఆస్తులు ఎంత..? మా ఓపికను బలహీనతగా భావించొద్దు. జాగృతి జనం బాటలో పార్టీని ఇలాగే విమర్శిస్తే చూస్తూ ఊరుకోం. గులాబీ శ్రేణులు ఆగ్రహిస్తే గ్రామాల్లో తిరగలేవు’’ అని బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు కవితను హెచ్చరించారు.

Updated Date - Jan 06 , 2026 | 02:49 AM