Share News

kumaram bheem asifabad- ‘రుచి మరిగి’న దళారులు

ABN , Publish Date - May 05 , 2026 | 10:21 PM

రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమంగా బియ్యం తరలిస్తూ దళారులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. రాజకీయ అండదండలతో వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జిల్లాలోని పలు మండలాలు మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున సరిహద్దులు దాటుతోంది.

kumaram bheem asifabad- ‘రుచి మరిగి’న దళారులు
బెజ్జూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం(ఫైల్‌)

- మహారాష్ట్రకు అక్రమ రవాణా

- నిందితులపై పీడీ యాక్టుకు అవకాశం ఉన్నా దృష్టి సారించని అధికారులు

బెజ్జూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమంగా బియ్యం తరలిస్తూ దళారులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. రాజకీయ అండదండలతో వ్యవహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జిల్లాలోని పలు మండలాలు మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున సరిహద్దులు దాటుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వీటి సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే పని చేస్తున్నాయి. చైన్‌ సిస్టంలా పని చేస్తూ ఒకరి నుంచి ఒకరు ప్రజల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. వాటిని పెద్దమొత్తంలో సేకరించి పలువురు వ్యాపారులు మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు రూ. 10వరకు కమీషన్‌ మిగులుతుండడంతో చాలా మంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని నిత్యం మహారాష్ట్రకు తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 6కిలోల బియ్యం ప్రభుత్వం అందజేస్తోంది. వీటిని కొందరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం అక్రమార్కులకు విక్రయిస్తుండడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

- పేదలకు సన్న బియ్యం..

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నం బియ్యం ఇస్తోంది. పేదలు సన్నబియ్యంతో అన్నం తినాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టగా, ఇది కూడా దళారుల పాలవుతుండటం గమనార్హం. సగటున కిలోకు రూ.15చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. మరి కొన్ని చోట్ల కొనేవారు ఇంటింటికి తిరిగి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి తదితర మండలాల్లో రేషన్‌ దందా జోరుగా కొనసాగుతోంది. ఆయా మండలాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్‌ ఉండటంతో కొంత మంది ఇదే పనిగా పెట్టుకొని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ.10నుంచి 15వరకు కొనుక్కొని అక్కడ కిలోకు రూ.20నుంచి 25వరకు అమ్ముకుంటున్నారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాచమార్గంగా మారింది. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు, బొలేరో, ఆటోల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సిర్పూర్‌ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని అక్కడికి చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా జరుగుతున్నా సంబంఽధిత అధికారులు తరచూ దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంత మంది రేషన్‌ ఇచ్చే డీలర్ల వద్ద నుంచే దళారులు రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలోనే దళారులు లబ్దిదారుల నుంచి అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రేషన్‌ డీలర్లు కూడా దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై ఈ తంతు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డీలర్లు బయటకు రాకుండా ఉండేందుకు దళారుల చేత బియ్యాన్ని సేకరించి వచ్చిన ఆదాయంలో సమంగా పంచుకుంటున్నారని బాహాటంగానే ఆరోపణలు ఉన్నాయి.

- పూర్తి స్థాయిలో దర్యాప్తు లేక..

జిల్లాలో రోజుల వ్యవధిలోనే అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన, తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. కాని వాటి మూలాల్లోకి మాత్రం వెళ్లడం లేదన్న సమాచారం. పట్టుబడిన వ్యక్తులు ఎక్కడి నుంచి వాటిని సేకరించారు. ఎన్ని నెలల నుంచి వ్యాపారం సాగుతోంది. తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు జరగకపోవడం వల్లనే కేసులు నమోదైనా మళ్లీ ఇదే దందా సాగించడమో లేదంటే వారి ప్రతినిధులను ఈ వ్యాపారంలో దింపి వెనుకనుంచి నడిపించడం లాంటివి చేస్తున్నారని తెలుస్తోంది. దొరికిన బియ్యానికి లెక్కలు అడిగి చర్యలు తీసుకుంటున్నారు. తప్పితే వారి వ్యాపార చరిత్రపై ఆరా తీయడం లేదు. పేదలకు అందించిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి నిత్యం రేషన్‌ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోతున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. పేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం ద్వారా అక్రమార్కులు లక్షలు అర్జిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందిన సమయాల్లోనే దాడులకు పాల్పడి కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- వేసవి దృష్ట్యా..

వేసవి దృష్ట్యా లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. కానీ పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. మూడు నెలల రేషన్‌ పంపిణీతో అధికారులు అక్రమ రవాణాపై నజర్‌ పెట్టడంతో కొంత మంది దళారులు తమ పంథాను మార్చుకున్నారు. కొందరు గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని మోటర్‌ సైకిళ్లు, లూనాలను ఎంపిక చేసుకొని తరలిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే వాహనాలపై 2నుంచి 3క్వింటాళ్ల బియ్యాన్ని వేసుకొని మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 4గంటల ప్రాంతంలో అధికారులు ఉండరన్న ఉద్దేశ్యంతో ఈ సమయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోటర్‌ సైకిళ్లు కావడం 1,2క్వింటాళ్లు మాత్రమే ఉంటాయి, తమను ఎవరేం చేస్తారు అంటూ దర్జాగా అమ్మేస్తున్నారు. చూసేవారికి ఇలా తక్కువగానే ఉండొచ్చు అదే నిత్యం రవాణా చేస్తుండడంతో వారికెంత మిగులుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం..

- సర్తాజ్‌పాషా, బెజ్జూరు ఎస్సై

గ్రామాల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నవారిపై చర్యలు తప్పవు. బియ్యం అక్రమంగా నిల్వ చేసినా, తరలించినా తమకు సమాచారం అందిస్తే పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే మండలంలో పలుచోట్ల దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాం. ఇకనైనా అక్రమార్కులు ఈ దందాను మానుకోవాలి.

Updated Date - May 05 , 2026 | 10:21 PM